రాఖీ రోజు ప్రశంసలు అందుకుంటోన్న తెలంగాణ కండక్టర్
బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బస్సులో గర్భిణికి డెలివరీ చేసిన మహిళా కండక్టర్ కి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాఖీ పండుగ రోజున తెలంగాణ ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో మహిళా కండక్టర్ కి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు. ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
గద్వాల డిపోకి చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.Telangana Lady Conductor Bharathi, Wanaparthy Depo Bus, TGSRTC MD Sajjanar, Ponnam Prabhakar
సజ్జనార్ ప్రశంసలు...
రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి ఆర్టీసీ యాజమాన్యం తరపున అభినందనలు తెలిపారు సంస్థ ఎండీ సజ్జనార్. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమన్నారు.
సేవాతత్పరతను చాటుతుండటం అభినందనీయం...
నిండు గర్భిణికి పురుడు పోసిన మహిళా కండక్టర్ భారతికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్ల తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే, మరోవైపు సేవాతర్పరతను చాటుతుండటం అభినందనీయం అని మంత్రి కొనియాడారు.