గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ అభయం..

గ్రూప్-1 అభ్యర్థులతో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ప్రతి అడుగునా తాను అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Update: 2024-10-17 09:13 GMT

గ్రూప్-1 అభ్యర్థులతో మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ప్రతి అడుగునా తాను అండగా ఉంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. గ్రూప్-1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు కేటీఆర్ వారిని కలిసి వారి సమస్యలపై చర్చించారు. ప్రతి సమస్య పరిష్కారం కోసం గ్రూప్-1 అభ్యర్థులు చేస్తున్న పోరాటంలో బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని, వారితో కలిసి ముందుకు సాగుతుందని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలో గ్రూప్-1 అభ్యర్థులు ఎదుర్కొంటున్న కష్టాలు తనకు తెలుసని, వాటిపై తాము కూడా పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా గ్రూప్-1 అభ్యర్థల వెంట బీఆర్ఎస్ నిలబడుతుందని అభయమిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులకు తాము తప్పకుండా సహకరిస్తామని, అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ కూడా వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గ్రూప్-1 మెయిన్ పరీక్షలు వాయిదా వేసేలా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు.

అయితే జీవో29ని ఎత్తివేయాలని, గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని ఔత్సాహికులు డిమాండ్ చేస్తున్నారు. తాము ఎంత అభ్యర్థిస్తున్నా, పోరాడుతున్నా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ సన్నాహాలు చేస్తోందని వారు చెప్పుకొచ్చారు.

వాటిని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు అశోక్ నగర్ రెడ్లెక్కి ఆందోళన వ్యక్తం చేశారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ప్రిలిమ్స్ పరీక్షల్లో జరిగిన తప్పులను, జీవో 29ని సవరించిన తర్వాత మెయిన్స్ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆందోళన తెలుపుతుండటంతో అశోక్‌ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని చెదగొట్టారు. పలువురిని స్టేషన్‌కు తరలించారు.

బీఆర్ఎస్‌కు పోరాటం కొత్తేమీకాదు: కేటీఆర్

‘‘పోరాటం మనేది బిఆర్ఎస్ పార్టీకి కొత్త ఏం కాదు. రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత? నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి... అలాంటి వ్యక్తీ మనకి ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. భారత దేశంలో జిల్లాకో మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఎందరో విద్యార్ధి అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇవ్వాల రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చిన తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుంది..వారికి అండగా ఉంటుంది’’ అని తెలిపారు.

అక్కడకే వద్దామనుకున్నా

‘‘జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూప్ 1 అభ్యర్థుల కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టు పోలీసుల ఉన్నారు. గ్రూప్ 1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు... వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుంది. రైతు బంధు, రుణమాఫి ఊసే లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకోని పోతుండు... ఇప్పటి వరకు 25 సార్లు ఢిల్లి పోయిన వ్యక్తీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారు. ఢిల్లీలో జుమ్లా పీఎం... రాష్ట్రంలో హౌలా సీఎం’’ అని తీవ్ర విమర్శలు చేశారు.

పిటిషన్ కొట్టేసిన కోర్టు

అయితే గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ విద్యార్థులు తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో హైకోర్టు.. ప్రభుత్వానికే మద్దతుగా తీర్పునిచ్చింది. విద్యార్థుల పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం నిర్ణయించినట్లు పరీక్షలు యథావిధిగా జరుగుతాయిన స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆలోచిస్తున్నారు. కాగా సుప్రీంకోర్టుకు విద్యార్థులు వెళితే అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులకు కాస్తంత బూస్ట్ వచ్చినట్లయింది. మరి వారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాలి.

అసలు కారణం ఇదే..

మార్చిలో కమిషన్ ఉద్యోగులు పేపర్ లీక్ చేసినట్లు తేలడంతో జూన్ లో జరగాల్సిన మెయిన్స్ ను రద్దు చేసింది. తరువాత అదే సంవత్సరంలో రెండో సారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే సరియైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ పరీక్షను సైతం రద్దు చేసింది. ఈ పరిణామంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 2023 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి అదనంగా మరో 60 పోస్టులను జతచేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.

కొత్తగా అందరూ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతకుముందే కమిషన్ ను సంస్కరించింది. కొత్త ఉద్యోగులకు నియమించింది. సుప్రీంకోర్టు లో తానే దాఖలు చేసిన కేసును కమిషన్ విత్ డ్రా చేసుకుంది. ఈ ఏడాది జూన్ లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన కమిషన్, అక్టోబర్ నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించడానికి సిద్దమైంది. అయితే తుది కీలో సరియైన జవాబులు లేవని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టి వేసింది.

Tags:    

Similar News