రాజీనామాకి రెడీ.. కేటీఆర్ ఛాలెంజ్

మూడో విడత రుణమాఫీ నిధుల విడుదల అనంతరం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ సంచలన సవాల్ చేశారు.

By :  Vanaja
Update: 2024-08-16 11:07 GMT

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పంద్రాగస్టున రెండులక్షల వరకు ఉన్న మూడో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేసింది. గురువారం ఖమ్మం జిల్లా వైరాలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర రావు బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. హరీష్ రావును రాజీనామా చెయ్యాలి లేదంటే అమరుల స్థూపం వద్ద ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ సంచలన సవాల్ చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా...

కాంగ్రెస్ రుణమాఫీపై, రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "నువ్వు చేసిన రుణమాఫీ నిజమైతే.. నీ నియోజకవర్గం కొడంగల్‌కు మీడియాతో కలిసి వెళ్దాం. 100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా నేను రాజకీయాలను వదిలేస్తా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ పచ్చిమోసాన్ని మేము ఎండగడతాం. సీఎంకు దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించాలి" అని కేటీఆర్ రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేశారు.

సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి...

సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే రేవంత్ రెడ్డిని ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారని కేటీఆర్ అన్నారు. సగం కూడా రుణమాఫీ చేయకుండా మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెబితే అది సంపూర్ణంగా దిగజారటమే అన్నారు. డిసెంబర్ 9 నాడు ఒకే సంతకంతో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అర్హులైన వారిలో కనీసం సగం మందికి కూడా రుణమఫీ చేయలేదు. కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి మోసం, పచ్చి దగా.. రైతులను మోసం చేసినందుకు సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి అని కేటీఆర్ అన్నారు.

"కేసీఆర్ చేసిన రుణమాఫీ పొందిన వాళ్లు కూడా రుణమాఫీకిి అర్హులని చెప్పారు. రెండు లక్షల రుణమాఫీ అన్నప్పుడు ఎంత అవుతుందని అందరూ లెక్క వేశారు. రూ. 40 వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే ఎంత విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం రూ. 2 లక్షల రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్లు కావాలని చెప్పారు. ఆ తర్వాత లెక్క మారింది.. రూ. 31 వేల కోట్లకే రుణమాఫీ అని కేబినేట్ తీర్మానం చేసింది. ఎన్నికలకు ముందు అందరికి అన్ని అన్నారు.. ఎన్నికల తర్వాత కొందరికి కొన్నే అని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమకు రుణమాఫీ కాలేదని వాపోతున్నారు. రుణమాఫీలో చాలా మందికి నిబంధనల పేరుతో కటింగ్‌లు పెట్టారు.. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అన్నట్లుగా మారిపోయింది" అని సీఎంని కేటీఆర్ విమర్శించారు.

ఇంతకీ రేవంత్ ఏమన్నారంటే...

ఖమ్మం జిల్లా వైరా బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు తిరగకుండానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామన్నారు. "పంద్రాగస్టులోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చాం. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నాం. 27రోజుల్లో 18వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారు. హరీష్ రావ్.. నీకు చీము, నెత్తురు ఉంటే రాజీనామా చెయ్. రాజీనామా చేయకపోతే అమర వీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి.. తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు" అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

"బీఆరెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చినా.. 7 చోట్ల డిపాజిట్లు పోయినా ఇంకా మీ బుద్ధి మారలేదా..? ప్రజలు మిమ్మల్ని మనుషులుగా చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనైనా గెలిపించేవారు కదా. బీఆరెస్ పార్టీది ప్రస్తుతం బంజారాహిల్స్ బస్టాండ్ లో అడుక్కు తినే పరిస్థితి. ఖమ్మం జిల్లాలో బీఆరెస్ కు మిగిలింది గాడిదగుడ్దు. బావ, బామ్మర్దులు అబద్దాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అండగా ఉంటే.. బీఆరెస్ ను సమూలంగా పెకలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బీఆరెస్ కు విసిరిన సవాలుతో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ఏ సెంటర్ లోనైనా చర్చకు సిద్ధం. హరీష్,కేటీఆర్ ఎవరు వస్తారో రండి... అమరవీరుల స్థూపం వద్దనైనా చర్చకు సిద్ధం" అంటూ రేవంత్ సవాల్ చేశారు.

Tags:    

Similar News