KTR | ‘ఉద్యోగాలిచ్చామని అశోక్ నగర్‌లో చెప్పు సీఎం’

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరుపు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కేటీఆర్ విమర్శలు సంధించారు. తెలంగాణలో ఏ హామీలు అమలవుతున్నాయని ప్రశ్నించారు.;

Update: 2025-01-17 06:06 GMT

‘తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది’ అన్నట్లు రేవంత్ రెడ్డి తీరు ఉందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దిక్కులేదు కానీ.. ఢిల్లీలో హామీలు అమలు చేయించే బాధ్యత తనదని చెప్తున్నారు ఈ పెద్దమనిషి అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయపార్టీలన్నీ స్పీడు పెంచాయి. అధికారమే లక్ష్యంగా ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ హామీల పోస్టర్లను గురువారం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌కే పట్టం కడితే ఇక్కడ కూడా సుభిక్ష పాలన అందిస్తామంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై తాజాగా కేటీఆర్ విసుర్లు విసిరారు. తెలంగాణలో ఏం చేస్తున్నారని ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలయిందా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

‘‘తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది సీఎం రేవంత్ రెడ్డి వైఖరి. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలనను ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి.. ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి ? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? తులంబంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు ? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ ? ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ ? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ ? - విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ ? పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు .. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా ? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాం తో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు ఉద్యోగాలు ఇచ్చామని. నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం’’ అని కేటీఆర్ చురకలంటించారు.

ఢిల్లీలో రేవంత్ ఏమన్నారంటే..

‘తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చాం. వాటన్నింటిని అమలు చేస్తున్నాం. రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేశాం. రైతుభరోసాను రూ.10000 నుంచి రూ.12000కు పెంచాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అతి త్వరలోనే నూతన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అది విజయవంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో కూడా ప్రజలంతా కలిసి కాంగ్రెస పార్టీకి అవకాశం ఇస్తే.. ఢిల్లీ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. దేశ రాజధాని అభివృద్ధి చేసే సత్తా కాంగ్రెస్‌కే ఉంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘‘ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించడానికి తెలంగాణ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని, ఢిల్లీ కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే బాధ్యత నాది. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏ సహాయం కావాలన్న తెలంగాణ నుంచి అందిస్తాం. ఢిల్లీలో పోటీ పడుతున్న కేజ్రీవాల్, మోదీ వేరువేరు కాదు. ఇద్దరూ ఒక్కరే. ఇద్దరూ అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. ప్రజలారా వారిని నమ్మకండి. కాంగ్రెస్‌కు ఓటేయండి’’ అని రేవంత్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News