కేటీఆర్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

కేటీఆర్ పిటిషన్ విచారణపై సీజేఐ కీలక వ్యాఖ్యలు. అంత తొందరేముంది అంటూ..;

Update: 2025-01-09 06:34 GMT

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు, ఇందులో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? కేటీఆర్‌ను కాంగ్రెస్ అన్ని విధాలుగా కార్నర్ చేసేసిందా? కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా? మాజీ మంత్రి అరెస్ట్ పక్కా అని బీఆర్ఎస్ కూడా అంగీకరిస్తుందా? దానికి తగ్గట్టుగానే తన కార్యాచరణను బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా? ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈవే చర్చలు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై అన్ని వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతన్నాయి. ఇందులో బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉంటున్నవారు ఉన్నారు. కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తున్న వారు ఉన్నారు. అంతేకాకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో కేటీఆర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా మాజీ మంత్రి ఊరట లభించలేదు. తన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్.. అత్యున్నత న్యాయస్థానం ఛాలెంజ్ చేశారు. కానీ కేటీఆర్ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకోవడానికి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. ఈ పిటిషన్‌ను ఈనెల 15న విచారణకు లిస్ట్ చేసి ఉందని, కాబట్టి అదే రోజున సదరు పిటిషన్‌పై విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. అంతలోపే కేటీఆర్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి. వరుసగా అధికారులను విచారిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈరోజు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది.

మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్.. ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధానంగా ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ విచారించనుంది. నిబంధనలకు విరుద్దంగా రూ.54 కోట్ల రూపాయలను విదేశీ సంస్థలకు ఎలా బదిలీ చేశారు? అనుమతులు ఎందుకు తీసుకోలేదు? అంత తొందరగా నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఏంటి? వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే శుక్రవారం హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించనుంది. ఈ నెల 16న కేటీఆర్‌ను ఈడీ విచారించనుంది.

Tags:    

Similar News