తీహార్ జైల్లో కేటీయార్, కవిత

శుక్రవారం నాడు ములాఖత్ సందర్భంగా కవితను కలవటానికి ముందుగానే కేటీయార్ తీహార్ జైలు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు.

Update: 2024-06-14 10:44 GMT

ఢిల్లీలోని తీహార్ జైల్లో కేటీయార్, కవిత కలుసుకున్నారు. చాలాకాలం తర్వాత వీళ్ళిద్దరి భేటీ జరిగింది. శుక్రవారం నాడు ములాఖత్ సందర్భంగా కవితను కలవటానికి ముందుగానే కేటీయార్ తీహార్ జైలు ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారు. దాదాపు అర్ధగంటపాటు అన్నా, చెల్లెళ్ళు ఇద్దరు కలుసుకున్నారు. కవిత ఆరోగ్య పరిస్ధితిని కేటీయార్ అడిగి తెలుసుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చిలో కవితను ఈడీ అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అంతకుముందు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలోని తన కార్యాలయంలోనే కవితను రెండురోజుల పాటు విచారించింది. అయితే ఆ తర్వాత విచారణకు రమ్మని కవితకు ఈడీ ఎన్ని నోటీసులిచ్చినా కవిత హాజరుకాలేదు. హాజరుకాకపోగా ఆఫీసుకు పిలిపించి తనను ఈడీ విచారించేందుకు లేదంటు కోర్టులో కేసు కూడా వేశారు. విచారణకు హాజరుకాకుండా ఉండటానికి కవిత రకరకాల కారణాలతో కోర్టుల్లో కేసులు వేశారు. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసులోనే విచారణకు రమ్మని సీబీఐ నోటీసులిస్తే దానికి కూడా ఇలాంటి జవాబే చెప్పి గైర్హాజరవుతున్నారు. ఏదో విధంగా దర్యాప్తుసంస్ధల విచారణనుండి తప్పించుకోవటమే కవిత లక్ష్యంగా స్పష్టమైపోయింది.

ఈ నేపధ్యంలోనే లిక్కర్ స్కామ్ లో పాత్రదారు అని కాకుండా లిక్కర్ స్కామ్ లో మనీల్యాండరింగ్ కోణంలో విచారణకు కవితను విచారణకు హాజరవ్వాలని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇవ్వటమే కాకుండా నేరుగా హైదరాబాద్ లోని ఆమె ఇంట్లోనే రెండురోజులు విచారించింది. చివరకు మూడోరోజు ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ చట్టం కింద కవితను ఈడీ అరెస్టుచేసి ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించింది. అప్పటినుండి కవిత జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె శతవిధాలుగా ప్రయత్నంచేస్తున్నా ఉపయోగం కనబడటంలేదు. అనారోగ్యమని, కొడుకు చదువు, పరీక్షలని, ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా పార్టీకోసం ప్రచారమని రకరకాల కారణాలతో బెయిల్ దరఖాస్తులు వేసినా కోర్టు దేన్నీ పరగణలోకి తీసుకోలేదు.

కవిత బెయిల్ పిటీషన్ దాఖలు చేసినపుడల్లా ఈడీ మనీల్యాండరింగ్ విషయంలో కవితకు సంబంధించిన కొత్త విషయాలను బయటపెడుతు బెయిల్ ను అడ్డుకుంటోంది. ఇప్పటికే 8 వేల పేజీలతో కవితపై ఈడీ సప్లెమెంటరీ చార్జిషీటును దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కవితను బెయిల్ పై తీసుకురావటానికి ఆమె కుటుంబం ఎంతగా ప్రయత్నాలు చేస్తే దర్యాప్తుసంస్ధలు అంత తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. దీంతో కవితకు బెయిల్ ఎప్పుడొస్తుందో తెలీటంలేదు. ఈ నేపధ్యంలోనే కేటీయార్ చెల్లెలును తీహార్ జైల్లో కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Tags:    

Similar News