'మూసీ అంచనాలు పెంచడం వెనుక వ్యూహమేంటి?'

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ నది ప్రక్షాళన బడ్జెట్ అంచనాలను మాటిమాటికీ పెంచడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు.

By :  Vanaja
Update: 2024-07-21 12:55 GMT

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ నది ప్రక్షాళన బడ్జెట్ అంచనాలను మాటిమాటికీ పెంచడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌తో సహా ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల కంటే నదుల సుందరీకరణ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యి ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చే నీటిపారుదల ప్రాజెక్టులకంటే మూసీ ప్రక్షాళన కోసం భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు చేయడం పట్ల కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు.

ఆదివారం ఆయన మాట్లాడుతూ... "మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం రూ.50,000 కోట్లుగా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత రూ.70,000 కోట్లకు సవరించింది. తాజాగా, ముసాయిదా ప్రణాళికలు సిద్ధం కాకముందే అంచనాలను రూ.1.5 లక్షల కోట్లకు సవరించారు. మూసీ అంచనాలు పెంచడం వెనుక అనుమానాలు కలుగుతున్నాయి. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీదాకా కాంగ్రెస్ గగ్గోలుపెట్టింది. మరి.. మూసీ సుందరీకరణకే.. రూ.లక్షా యాభై వేల కోట్లా..? ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో.. ఎంతమందికి లాభం చేకూరనుంది అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సొంత జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా.. మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ? చివరిదశలో ఉన్న ప్రాజెక్టును పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి.. మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..?? మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అని కేటీఆర్ ఆరోపించారు.

మూసీ చుట్టూ చిక్కుముళ్లు...

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తాగు, శ్రామిక అవసరాలకు నీటి కొరతను అరికట్టడానికి, నగర అభివృద్ధికి మూసీ నదితో ముడిపెట్టారు. మూసీ నది ప్రక్షాళన జరిగితే నది చుట్టూ ఉన్న నగరం అభివృద్ధి జరుగుతుందని ఆయన చెబుతున్నారు. లండన్ థేమ్స్ నదిని ప్రామాణికంగా తీసుకున్నారు. గతంలో పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ నది పాలకమండలి అధికారులు, నిపుణులతో భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను వారితో చర్చించారు. లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామని చెబుతున్నారు. తాజాగా దీనికోసం రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.

అయితే రాష్ట్ర బడ్జెట్ రూ.2.5 లక్ష కోట్లల్లో మూసీకే రూ.లక్షన్నర కోట్లు బడ్జెట్ కేటాయించడం సాధ్యమేనా? సరే తిప్పలు పడి బడ్జెట్ కేటాయించినా మూసీ ప్రక్షాళనకు ఉన్న అడ్డంకులు ఆయనకి తెలియవా అంటే తెలుసు. నది చుట్టూ ఎన్నో నిర్మాణాలు ఉన్నాయి. సగానికి పైగా మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాలు ఎంఐఎం ఆధీనంలో ఉన్నాయి. అక్కడ నివసించే జనాభాని ఖాళీ చేయించి పనులు ప్రారంభించేది ఎప్పటికి? నిలిపివేయడానికి ఎంతోమంది కోర్టుకి వెళ్లొచ్చు. స్టే లు పడొచ్చు. ఈలోపు ఎన్ని ప్రభుత్వాలైనా మారొచ్చు. మూసీ ప్రక్షాళన మంచి విషయమే కానీ అప్పుల రాష్ట్రంలో, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తూ... అదనంగా అవుతుందో లేదో తెలియని మూసీ కోసం అక్షరాలా లక్షన్నర కోట్లు ఖర్చు చేయాలనుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.       

Tags:    

Similar News