‘దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లండి’.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-04 10:20 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పులకేసిలా హింసిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డిని ఆపలేక మౌనంగా ఉన్నారా? లేకుంటే ఈ హింత మీ కనుసన్నల్లోనే జరుగుతుందా? అని నిలదీశారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఒక్క ఏడాది పాలనలోనే పదేళ్ల విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్‌దని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు పిలిస్తే క్షణాల్లో వస్తానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రజలు ఆర్తనాధాలు చేస్తున్నా, వెక్కివెక్కి ఏడుస్తున్నా ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. గాంధీ భవన్‌కు కాకుండా ప్రజల చెంతకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మొదలయ్యాయని ఆరోపించారు. పదేళ్ల పాటు సుభిక్ష పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాక్షస పాలన, దోపిడీ పాలనను చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్య తిరిగిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ప్రజల కంటికి కూడా కనబటం లేదని, అదే విధంగా ప్రజల కష్టాలు నేతల కళ్లకు కనిపించడం లేదని ఆరోపించారు.

ప్రజలకు క్షమాపణ చెప్పాలి..

‘‘ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అని ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఎన్నికల సమయంలో మొత్తం 420 హామీలు ఇచ్చి ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. ఆ మోసానికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలంతా క్షమాపణలు చెప్పాలి. ఏడాది కాలంలో అన్ని వర్గాలు రోడ్డెక్కించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. సబ్బండ వర్గాలను మోసం, నయవంచనకు గురి చేసిన పాపంలో ప్రధాన పాత్ర మీదే రాహుల్ జీ. మీ ప్రభుత్వ ఫల్యాలు తీస్తే చిత్రగుప్తుడి చిట్టా వచ్చినట్లు వస్తుంది’’ అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

దమ్ముంటే అక్కడకు వెళ్లండి..

‘‘మకు దమ్ముంటే గాంధీ భవన్‌కు కాకుండా హైడ్రా బాధితుల దగ్గరకు వెళ్లాలి. కాంగ్రెస్ చేతకాని పాలనతో రైతులు, ఆటో డ్రైవర్లు, యువత, నేతన్నలు, పోలీసులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారందరి కుటుంబాల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వం పోసుకుంటుంది. మీ అనుమతితోనే తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్.. అదానీతో దోస్తీ, మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. అభివృద్ధి పథంలో ఉన్న తెలంగాణను అధికార పీఠం ఎక్కిన ఏడాదిలోనే అవినీతి తెలంగాణగా మార్చారు. తెలంగాణ ప్రజల తరుపున నేను మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతున్నా. వీటికి సహాధానం చెప్పంది. అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ తరుపున మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని రాహుల్ గాంధీని కేటీఆర్ కోరారు.

Tags:    

Similar News