‘దేవర’ ఈవెంట్ రద్దుకు అసలు కారణం చెప్పిన కేటీఆర్.. ఏమన్నారంటే..!

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసుర్లు విసిరారు.

Update: 2024-09-25 13:31 GMT

జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త సినిమా ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసుర్లు విసిరారు. ఎంతో అద్భుతంగా నిర్వహించాలని మూవీ మేకర్స్, తమ అభిమాన హీరోను చూడాలన్న ఆత్రుతతో అభిమానులు ఎక్కడెక్కడి నుంచో అక్కడి వస్తే వారికి ఆశలపై నీరు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సెటైర్లు వేశారు. ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు అంశంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో చిన్న పండగలను కూడా తమ పార్టీ నేతలు, ప్రజలు కలిసి ఎంతో గ్రాండ్‌గా నిర్వహించేవారని, కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సినిమా ఈవెంట్‌ను కూడా సక్రమంగా నిర్వహించలేకుందంటూ పంచులు పేల్చారు. ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు ప్రతి రోజూ బాధపడుతున్నారని అన్నారు. ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అసమర్దతే కారణమని ఆయన పునరుద్ఘాటించారు.

మేము ఎన్నో నిర్వహించాం..

‘‘బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. అందులో భాగంగానే చిన్న పండగ వచ్చినా మా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలను వియవంతం చేశారు. ఈ ఈవెంట్లను నిర్వహించే సమయంలో ఒక్కరికి కూడా ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేవారు. అది ఫార్ములా రేస్ కావొచ్చు, గణేష్ నిమజ్జన కార్యక్రమం కావొచ్చు.. మొహర్రం ఊరేగింపు కావొచ్చు, బోనాల పండగ ఏదైనా ఎంతో శాంతియుతంగా నిర్వహించాం. ఆఖరికి పెద్దపెద్ద సినిమాల ఈవెంట్లకు కూడా ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. అభిమానులు, ప్రేక్షకులు ఎంత సంఖ్యలో వచ్చినా ఎటువంటి అంతరాయం లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే’’ అని వివరించారు.

ఇప్పుడు అంత సినిమా లేదు..

‘‘కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులను అన్నీ అయోమయం గందరగోళంగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన సరికొత్త సినిమా ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే దాన్ని కూడా ఈ అసమర్థ ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. వీరి చేతకానితనం వల్ల ఆ రోజు ట్రాఫిక్ అంతరాయం కూడా తీవ్రంగా ఉంది. కిలోమీటరు ప్రయాణించడానికి గంట సమయం పట్టింది. గతంలో ప్రతి ఈవెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఎగ్జిక్యూట్ చేశాం. కానీ ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. బీఆర్ఎస్ హయాంలో అన్నీ పండుగలు, ఈవెంట్లు అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది ప్రజలకు బాగా తెలుసు’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

దేవర ఈవెంట్ రద్దుకు ఏమైంది..

జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా నిర్వహించాలని భారీగా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఎన్‌టీఆర్ క్రేజ్‌కి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని ఫ్యాన్స్ అనుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో ఈ వెంట్‌ను నిర్వహిస్తున హెచ్ఐసీసీ నోవాటెల్‌కి వరదలా విచ్చేశారు. దీంతో అక్కడ భద్రత అదుపు తప్పింది. చేసేదేమీ లేదని.. ఈవెంట్ రద్దు చేసుకోవాలని పోలీసులు సూచించడంతో మూవీ టీమ్ కూడా చేసేదేమీ లేక.. ఈ ఈవెంట్‌ను రద్దు చేసుకుని వెనుతిరిగింది.

మేకర్స్ ఏం చెప్పారంటే..

‘‘ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు శ్రమించాం. ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌టీఆర్ మళ్ళీ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ‘దేవర’ ప్రీరిలీజ్‌ను గ్రాండ్‌గా చేయాలని కలలు కన్నాం. కానీ ఈ ఈవెంట్ నిర్వహణ విషయంలో అడుగడుగా సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రీరిలీజ్ ఈవెంట్.. గణేష్ నిమజ్జనానికి చాలా దగ్గర డేట్స్‌లో షెడ్యూల్ చేయబడింది. ఇలాంటి ఈవెంట్‌ల ప్రిపరేషన్స్‌కే వారం రోజులు పడుతుంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా అడ్డంకులు సృష్టించాయి. ఈరోజు వర్షం పడకపోయినా.. మేము ప్లాన్ చేసినట్లు బహిరంగ కార్యక్రమం నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలించలేదు. అయినా ఎంతో ప్రయత్నించాం. అభిమానులు సునామీలా రావడంతో బ్యారికేడ్లు కూడా వినిగిపోయాయి. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మీ ప్రియతమ హీరోను చూడటానికి సుదూర ప్రాంతాలను వచ్చారని తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు చింతిస్తూ మీకు క్షమాపణలు చెప్తున్నాం. అదే విధంగా అందరూ ఇళ్లకు సురక్షితంగా చేరుకున్నారని ఆశిస్తున్నాం’’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు.

శ్రేయస్ మీడియాపై అభిమానుల ఆగ్రహం..

అయితే ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడనికి నిర్వాహక సంస్థ శ్రేయస్ మీడియా చేతకాని తనమే కారణమని అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చేతకానప్పుడు పక్కకు తప్పుకుని సమర్థులకు పని అప్పగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నావాటెల్‌లో జరుగతున్న పెద్ద ఈవెంట్ ఇదొక్కటే కాదని, గతంలో మరెన్నో పెద్దపెద్ద ఈవెంట్‌లకు కూడా నోవాటెల్ వేదికగా నిలిందని చెప్తున్నారు. కానీ దేవర ఈవెంట్ నిర్వాహకులు ఆలోచనాపాలోచన లేకుండా ఇష్టానుసారంగా అనుమతికి మించిన సంఖ్యలో పాస్‌లు ఇచ్చేయడం, ముందస్తు భద్రత ప్రమాణాలు పాటించడం కూడా సరిగా లేదని అభిమానులు చెప్తున్నారు. పరిమితికి మించి పాస్‌లు ఇవ్వడంతో అభిమానులు నోవాటెల్‌కు పోటెత్తారు. అంతేకాకుండా లోపలికి వచ్చిన అభిమానులు పాస్‌ల ప్రకారం కూర్చోకుండా ఎక్కడ పడితే అక్కడ దొరిందే ఛాన్స్ అన్నట్లు కూర్చుండిపోయారు.. వారిని అడ్డుకోవడంలో కూడా నిర్వాహకులు విఫలమయ్యారు. పార్టీషన్ చేయడం కూడా సరిగా రాలేదు నిర్వాహకులకు. భారీ సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్ అదుపు చేయడానికి సరిపడా భద్రతను కూడా రెడీగా ఉంచుకోలేదు. సాధారణంగానే మూవీ ఈవెంటల్స్ అంటే కేవలం పోలీసులపై ఆధారపడకుండా.. ప్రైవేట్ సెక్యూరిటీని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా నిర్వాహాకులు నిర్లక్ష్యం వహించారు. దీని వల్ల అక్కడ గందరగోళం ఏర్పడి.. ఈవెంట్ రద్దయిందని అభిమానులు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మరే ఇతర సినిమా నిర్మాతలు కూడా తమ సినిమా ఈవెంట్స్ సక్సెస్ అవ్వాలంటే ఈవెంట్ నిర్వహణ బాధ్యతను శ్రేయస్ మీడియాకు ఇవ్వొద్దని కూడా ఎన్‌టీఆర్ అభిమానులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News