వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

By :  Vanaja
Update: 2024-08-12 13:35 GMT

వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపోజల్ పై మేరకు కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ఆయన వివరించారు. యంగాన్‌ కార్పొరేషన్ (Youngone Corporation) చైర్మన్ కియాక్‌ సంగ్‌ (Kihak Sung), కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (KOFOTI) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్‌ జూ (Soyoung Joo) సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు.

అంతకంటే ముందు... కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ (LS Group) చైర్మన్ కు-జాఉన్ (Koo Ja-eun) తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ (LG Group) వ్యవస్థాపకులైన LS Group కుటుంబాన్ని కలవడంతో కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్, బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఆసక్తి కనబర్చింది. రేవంత్ ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనుంది. ఎల్ఎస్ గ్రూప్ (LS Group) అధినేతతో సీఎం సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు, ఎల్ఎస్ గ్రూప్ సీనియర్ ప్రతినిధులు కూడా ఉన్నారు.

Tags:    

Similar News