రేవంత్ 'అన్న' పేరు చెప్పి ఇరికించిన సొంత ప్రజలు

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ కేటీఆర్ ని కలిశారు.

By :  Vanaja
Update: 2024-08-09 14:15 GMT

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ కేటీఆర్ ని కలిశారు. మా సమస్యకి పరిష్కారం చూపాలంటూ ఆయన్ని వేడుకున్నారు. ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం నియోజకవర్గంలోని ప్రజల భూమికే రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ శ్రేణులు ఈ అంశంతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన అన్న ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సొంత నియోజకవర్గ ప్రజలే ఇరకాటంలోకి నెట్టేయడం ప్రత్యర్థులకు సువర్ణావకాశంగా మారింది.

అసలు విషయం ఏంటంటే...

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని... ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిశారు. దుద్యాల్ మండలం లోని హకీంపేట్, పోలేపల్లి, లకచర్ల గ్రామాలలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్‌ కు తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి వీరంతా కేటీఆర్ తో భేటీ అయ్యారు.

ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ, సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని, తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్‌ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారం అని... ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News