కిషన్ చెప్పిన అందమైన అబద్ధం

పేషంట్ చనిపోయేంతవరకు బతుకుతాడని డాక్టర్, కేసు ఓడిపోయేంతవరకు గెలుస్తామని లాయర్ చెబుతునే ఉంటారు. పై రెండు డైలాగులను చాలా సినిమాల్లో వినే ఉంటారు.

Update: 2024-06-20 04:50 GMT

పేషంట్ చనిపోయేంతవరకు బతుకుతాడని డాక్టర్, కేసు ఓడిపోయేంతవరకు గెలుస్తామని లాయర్ చెబుతునే ఉంటారు. పై రెండు డైలాగులను చాలా సినిమాల్లో వినే ఉంటారు. ఇపుడు సింగరేణి విషయంలో కూడా కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి డైలాగులు కూడా అలాగే ఉన్నాయి. సింగరేణి సంస్ధను ప్రైవేటుపరం చేయటంలేదని పెద్ద డైలాగు కొట్టారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రశ్నేలేదని గంభీరంగా చెప్పారు.

 

సింగరేణి సంస్ధలో రాష్ట్రప్రభుత్వ వాటా 51 శాతమైతే కేంద్రం వాటా 49 శాతం మాత్రమే అని చెప్పారు. 51 శాతం ఉన్న సింగరేణి సంస్ధను కేంద్రప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటుపరం చేయగలదని అమాయకంగా ప్రశ్నించారు. నిజానికి కిషన్ ఈ విధంగా కూడా అబద్ధాలు చెప్పగలరని ఇపుడే తెలిసింది. సింగరేణిలో కేంద్రప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నదన్న విషయం వాస్తవమే. అయినా సరే సింగరేణి ఉసురు తీసేయటానికి నరేంద్రమోడి ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించిందన్నది వాస్తవం. ఆ విషయం ఎవరికీ తెలీదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అనుకుంటున్నారు. 2015లోనే క్యాపిటల్ మైనింగ్ యాక్ట్ ను మోడి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం దేశంలో ఎక్కడ బొగ్గుగనులన్నా సరే వేలంపాట వేయాల్సిందే, అత్యధిక ధరలను కోట్ చేసిన సంస్ధలకు అప్పచెప్పాల్సిందే.

 

 

2015కి ముందు సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గుగనులపై యాజమాన్యానికే గుత్తాధిపత్యం ఉండేది. ఎక్కడ బొగ్గు గనులున్నాయనే విషయాన్ని యాజమాన్యం నిరంతరం వెతుకుతునే ఉంటుంది. ప్రత్యేకంగా సింగరేణిలోని ఒక బృందం బొగ్గుగనుల కోసం అధ్యయనం, పరిశీలన చేస్తునే ఉంటుంది. దాని ప్రకారం చాలా బొగ్గుగనులు ఉన్నాయని వాటిల్లో కోట్లాది టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు బయటపడింది. ఉదాహరణకు కోయగూడెం, సత్తుపల్లి 3, శ్రావణపల్లిలో ఎంతో పరిశోధన చేసి బొగ్గు నిక్షేపాలున్నట్లు తెలుసుకుంది. అయితే వాటిని భవిష్యత్తవసరాల కోసం అట్టేపెట్టుకుంది. ఎందుకంటే ఇపుడు తవ్వకాలు జరుగుతున్న18 అండర్ గ్రౌండ్, 22 ఓపెన్ క్యాస్ట్ గనులనుండి బొగ్గు నిక్షేపాలు పదేళ్ళపాటు వస్తాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసింది. కాబట్టి అర్జంటుగా కొత్తగనుల్లో యాక్టివిటీస్ మొదలుపెట్టాల్సిన అవసరంలేదు.

 

 

అయితే సింగరేణి ఊహించని విధంగా మోడి ప్రభుత్వం సింగరేణి గనులన్నింటినీ ఒక చట్టం ద్వారా తన పరిధిలోకి తీసేసుకున్నది. తమపరిధిలోని గనులను తిరిగి తమకే అప్పగించమని యాజమాన్యం ఎన్నిసార్లు మొత్తుకున్నా మోడి ప్రభుత్వం పట్టించుకోలేదు. 15 గనుల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని యాజమాన్యం కేంద్రాన్ని రిక్వెస్టు చేస్తే వేలంపాటల్లో పాల్గొని గనులను సొంతంచేసుకోమని మోడి ప్రభుత్వం సమాధానమిచ్చింది. దాంతో ఇపుడు సింగరేణికి తవ్వకాలు జరుగుతున్న గనులు తప్ప ఇంకేమీ మిగలలేదు. తాను అధ్యయనంచేసి, నిక్షేపాలున్నాయని కనుక్కున్న గనులను కూడా మోడి ప్రభుత్వం లాగేసుకున్నది. దాంతో ఇపుడు తవ్వకాలు జరుగుతున్న గనుల నుండి బొగ్గు మహాయితే మరో పదేళ్ళు వస్తుందంతే. తర్వాత గనులు లేకపోతే సింగరేణి మూతపడాల్సిందే తప్ప వేరేదారిలేదు. ప్రైవేటుసంస్ధలతో పోటీపడి గనులను సొంతంచేసుకోవటం సింగరేణికి సాధ్యంకాదు. 2022లో జరిగిన వేలంపాటల్లో కోయగూడెం, సత్తుపల్లి-3 గనులకు ప్రైవేటుసంస్ధలు పోటీపడితే అరబిందో సంస్ధ సొంతం చేసుకుంది.

 

 

ఇపుడు శ్రావణపల్లి గనికోసం 21వ తేదీన వేలంపాట జరగబోతోంది. ఈ వేలంపాటలో సింగరేణి కూడా పాల్గొనబోతోందని సమాచారం. శ్రావణపల్లి గనిలో 12 మిలియన టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. అలాగే అరబిందో సంస్ధ సొంతంచేసుకున్న రెండు గనుల్లో 20 మిలియన్ టన్నుల బొగ్గుంది. బొగ్గు నిక్షేపాల కోసం కోల్ ఇండియా లిమిటెడ్ అధ్యయనాలు చేస్తున్నది. ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎంత బొగ్గున్నా సింగరేణికి మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. చుట్టూ సముద్రమే ఉన్న తాగటానికి చుక్కనీరు కూడా పనికిరాదన్నట్లుగా తయారైంది సింగరేణి పరిస్ధితి. ఈ విషయాలన్నీ కిషన్ రెడ్డికి బాగా తెలుసు. గనులు లేకపోతే మరో పదేళ్ళలో సింగరేణి పరిస్ధితి ఏమవుతుందో కూడా కిషన్ కు పూర్తి అవగాహనుంది. అన్నీ తెలిసికూడా మొదట్లో చెప్పుకున్నట్లు సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రశ్నలేదని అందమైన అబద్ధం చెప్పారు. బొగ్గు తవ్వకాలకు సొంత గనులు లేనపుడు సింగరేణి ఉనికి ఎలా సాధ్యమో కిషనే చెప్పాలి. గనులన్నీ ప్రైవేటుపరం చేసేసిన తర్వాత వేలంపాటల్లో అదాని, జిందాల్, టాటాస్టీల్ లాంటి సంస్ధలతో సింగరేణి ఏ విధంగా పోటీపడగలదు ? సింగరేణి బొగ్గు నాణ్యమైనది కాబట్టి విద్యుత్, స్టీల్ లాంటి అనేక ఇండస్ట్రీల్లో ఉపయోగిస్తారు.

 

గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే సింగరేణిని ప్రైవేటుపరం చేయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పింది అబద్ధమని అర్ధమైపోతోంది. దీన్నే అందమైన అబద్ధమని అంటారు. ప్రైవేటుసంస్ధలన్నీ ఓపెన్ క్యాస్ట్ గనులవైపే కాని అండర్ గ్రౌండ్ మైన్స్ వైపు చూడవు. ఎందుకంటే ఆదాయంకన్నా ఖర్చులు చాలా ఎక్కువ. కాబట్టి అండర్ గ్రౌండ్ మైనులో నష్టాలే వస్తాయి. సింగరేణి కాబట్టి అండర్ గ్రౌండ్ లో వచ్చే నష్టాలను ఓపెన్ క్యాస్ట్ లో వచ్చే లాభాలతో బ్యాలెన్స్ చేస్తోంది. ఓపెన్ క్యాస్ట్ గనులన్నీ ప్రైవేటు సంస్ధలు తీసేసుకుని అండర్ గ్రౌండ్ మైన్సును సింగరేణి మొహానకొడితే యాజమాన్యం ఏమిచేసుకోవాలి.

 

ఇదే విషయాన్ని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘నరేంద్రమోడి ప్రభుత్వం సింగరేణికి తీరని అన్యాయం చేస్తోంద’న్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయమని కిషన్ రెడ్డి చెప్పిందంతా అబద్ధమే అన్నారు. ‘ఒకవైపు సింగరేణి గనులను వేలంపాట వేస్తు మరోవైపు ప్రైవేటుపరం చేయటంలేదని చెప్పటంలో అర్ధంలేద’న్నారు. ‘గనులన్నింటినీ కేంద్రం తీసేసుకున్న తర్వాత ఇక సింగరేణి చేసేది ఏముంటుంద’ని ప్రశ్నించారు. ప్రైవేటుసంస్ధలతో పోటీపడి సింగరేణి గనులను సొంతం చేసుకోవటం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. శ్రావణపల్లి గని వేలంపాటలో ఏమి జరుగుతుందో చూడాలన్నారు.

Tags:    

Similar News