దేశంలో ప్రతి ఇంటి నినాదం ఇదేనట..!

"దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతున్నాం. జూన్ రెండవ వారంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు".

By :  Vanaja
Update: 2024-04-25 08:36 GMT

దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతున్నాం. జూన్ రెండవ వారంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు నుంచి మే 13వ తేదీ వరకు కార్యకర్తలందరూ బీజేపీ జెండాలతో గ్రామగ్రామాన తిరిగి మోదీని ప్రధానమంత్రిని చేసుకునేలా, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకునేలా ప్రచారం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారీ మెజారిటీతో బండి సంజయ్ ని గెలిపించాలని కరీంనగర్ ఓటర్లను కోరారు.

ఇంకా కిషన్ రెడ్డి ఏమన్నారంటే...

మే 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు.. దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే ఎన్నికలు. దేశ భవిష్యత్తు, అభివృద్ధిని ముందుకుతీసుకెళ్లే ఎన్నికలు. రాష్ట్రంలో 17కు 17 ఎంపీ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. ఫిర్ ఏక్ బార్.. చార్ సౌ పార్.. ఇది పార్టీ నినాదమే కాదు.. దేశంలో ప్రతి ఇంటి నినాదమైంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడికెళ్లినా ప్రజలందరూ మోదీ నామమే స్మరిస్తున్నారు. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో 400 సీట్లు గెలవబోతున్నాం. జూన్ రెండవ వారంలో మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్నారు.

బండి సంజయ్ పోరాటమే స్ఫూర్తిగా తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేశారు. రానున్న రోజుల్లో కరీంనగర్ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసే వ్యక్తి బండి సంజయ్. కరీంనగర్ లో ప్రజల కోసం పోరాటం చేసిన అభ్యర్థి ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఏనాడు ప్రజల తరఫున పోరాడలేదు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బండి సంజయ్ ని గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అని కిషన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో రేవంత్ రెడ్డి చెప్పాలి...

అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరుతో.. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలకు హామీలిచ్చారు. కాని హామీలేవీ అమలు చేయలేదు. రుణమాఫీ, రైతుకూలీలు, కౌలు రైతులకు 15000 ఇవ్వలేదు క్వింటాలు ధాన్యానికి రూ. 500 బోనస్.. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వివాహం చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామంటూ హామీ ఇచ్చారు.. ఎందుకు అమలు చేయలేదు..? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. అసలు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదు. గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపించి ఓట్లు అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి బీఆర్ఎస్ కి లేదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఒకే తానుముక్కలే. మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే అని కిషన్ రెడ్డి విమర్శించారు.

Tags:    

Similar News