కేసీయార్ కు సుప్రింకోర్టే దిక్కా ? విలవిల్లాడిపోతున్నారా ?
అధికారంలో ఉన్నామన్న గర్వంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడితే కాలం ఎదురుతిరిగితే కేసీయార్ లాగే విలవిల్లాడాల్సుంటుంది.
రేవంత్ రెడ్డి రాజకీయం దెబ్బకు కేసీయార్ కు దిక్కులు తెలుస్తున్నట్లు లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకళ్ళదే పైచేయిగా ఉండదు. అధికారంలో ఉన్నామన్న గర్వంతో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడితే కాలం ఎదురుతిరిగితే కేసీయార్ లాగే విలవిల్లాడాల్సుంటుంది.
ఇపుడు విషయం ఏమిటంటే ఫిరాయింపులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ తొందరలోనే సుప్రింకోర్టులో కేసు వేసే విషయాన్ని ఆలోచిస్తోందని సమాచారం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. వీళ్ళని అడ్డుకోవటం కేసీయార్ వల్లకావటంలేదు. బీఆర్ఎస్ తరపున గెలిచిన 39 మంది ఎంఎల్ఏల్లో ఐదుగురు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఫిరాయించేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సుమారు 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. వీళ్ళ ప్రకటనలకు తగ్గట్లే విడతలవారీగా కొందరు కారుపార్టీ ఎంఎల్ఏలు నియోజకవర్గాల అభివృద్ధిపేరుతో ఇప్పటికే రేవంత తో భేటీ అయిన విషయం తెలిసిందే.
నిజంగానే 25 మంది ఎంఎల్ఏలు కారుపార్టీని వదిలేస్తే బీఆర్ఎస్ తో పాటు కేసీయార్ కు ఇబ్బందులు తప్పవు. ముందు అసెంబ్లీలో పార్టీ ఉనికి కోల్పోతుంది. అలాగే కేసీయార్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోల్పోతారు. తర్వాత దీని ప్రభావం శాసనమండలి మీద పడి మెజారిటి ఎంఎల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరిపోయే అవకాశాలున్నాయి. అప్పుడు అసెంబ్లీ, మండలిలో బీఆర్ఎస్ మెజారిటి కోల్పోతే అసలైన బీఆర్ఎస్ తమదే అని బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు స్పీకర్, మండలి ఛైర్మన్ను రిక్వెస్టు చేసుకునే అవకాశముంది. అప్పుడు పార్టీలో చీలికతప్పదు. మహారాష్ట్రలో శివసేన చీలిపోయినట్లే అవుతుంది. ఇదేజరిగితే బీఆర్ఎస్ పై కోలుకోలేని దెబ్బపడుతుంది. వీటన్నింటినీ ఊహించుకుని పరిస్ధితి అంతదాకా రాకూడదనే కేసీయార్ సుప్రింకోర్టులో కేసు వేసే విషయాన్ని ఆలోచిస్తున్నారట.
ఇప్పటికే దానం నాగేందర్ ఫిరాయింపును చాలెంజ్ చేస్తు బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి కేసు వేసున్నారు. ఆ కేసుపై ఈనెల 27వ తేదీన విచారణ జరగబోతోంది. ఒకవేళ హైకోర్టులో కేసీయార్ అనుకున్నట్లు తీర్పురాకపోతే వెంటనే సుప్రింకోర్టులో కేసు వేసే విషయాన్ని న్యాయనిపుణులతో కేసీయార్ మాట్లాడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కోర్టులో కేసు వేసినందువల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా ? అని. ఎందుకంటే ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు, అనర్హత వేటు విషయాన్ని మామూలుగా అయితే కోర్టులు స్పీకర్, ఛైర్మన్లకే వదిలేస్తాయి. గతంలో తెలంగాణా, ఏపీ, మహారాష్ట్రలో ఫిరాయింపులపై కాంగ్రెస్, వైసీపీ, శివసేనలు కోర్టుల్లో కేసులు వేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. రెండువైపుల వాదనలు విన్న తర్వాత అనర్హత వేటు విషయమై తగిన నిర్ణయం తీసుకునే విషయాన్ని స్పీకర్లు, ఛైర్మన్లకు కోర్టులు వదిలేశాయి. స్పీకర్లు ఫిరాయింపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో యధేచ్చగా ఫిరాయింపులు కంటిన్యు అయ్యాయి.
2014లో అధికారంలోకి వచ్చిన కేసీయార్ టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీలకు చెందిన నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఎంత గోలచేసినా కేసీయార్ లెక్కకూడా చేయలేదు. కాలం అందరి సరదాలను తీర్చేస్తుందన్నట్లుగా ఇపుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవే ఫిరాయింపులు మొదలుపెట్టారు. రేవంత్ దెబ్బకు కేసీయార్ విలవిల్లాడిపోతున్నారు. విచిత్రం ఏమిటంటే తాను ఫిరాయింపులకు పాల్పడినపుడు సమర్ధించుకున్న కేసీయార్ ఇపుడు అవే ఫిరాయింపులకు కాంగ్రెస్ పాల్పడుతుంటే తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం. కేసీయార్ తో పాటు కేటీయార్, హరీష్ రావు ఫిరాయింపులకు వ్యతిరేకంగా గోలగోల చేస్తున్నారు.
కోర్టులో కేసు వేసినంతమాత్రాన పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటంలేదు. ఒకవేళ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినా స్పీకర్, ఛైర్మన్ దాన్ని పాటించాలని లేదు. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ అధికారాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించేందుకు లేదు. ఫిరాయింపులు తప్పని కోర్టు తీర్పిచ్చినా స్పీకర్ లేదా ఛైర్మన్ పట్టించుకోకపోయినా కోర్టులు చేయగలిగేదేమీలేదు. ఈ విషయం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏపీ విషయంలో తేలిపోయింది. ఫిరాయింపులు, అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాల్సింది తానే కాని కోర్టు కాదని స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ చెప్పారు. దాంతో కోర్టు కూడా ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఇపుడు బీఆర్ఎస్ కోర్టులో కేసులు వేసినా పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు.
ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మాట్లాడుతు తాను అధికారంలో ఉన్నపుడు పాల్పడిన ఫిరాయింపులను కేసీయార్ మరచిపోయినట్లున్నారు అంటు ఎద్దవాచేశారు. 2014లో అధికారంలోకి రాగానే కేసీయార్ ఫిరాయింపులకు పాల్పడిన విషయాన్ని షబ్బీర్ గుర్తుచేశారు. ఫిరాయింపుల వల్లే టీడీపీ భూస్ధాపితమైపోయిన విషయం అందరికీ తెలుసన్నారు. టీడీపీ ఎంఎల్ఏలందరినీ లాగేసుకున్న కేసీయార్ చివరకు ఆ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుండి కూడా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను లాగేసుకున్న విషయాన్ని చెప్పారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేసీయార్ నలుగురు ఎంపీలు, 25 మంది ఎంఎల్ఏలు, 18 మంది ఎంఎల్సీలను ఫిరాయింపులకు ప్రోత్సహించి లాగేసుకున్న విషయాన్ని కేసీయార్ కు షబ్బీర్ గుర్తుచేశారు.