Komatireddy | ఓఆర్ఆర్‌ను కేసీఆర్ అమ్మేసిండు, మంత్రి వ్యాఖ్యలు

ఔటర్ రింగ్ రోడ్డును ఎన్నికలకు ముందు కేసీఆర్ అమ్మేసిండు అని రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.దీనిపై తాము విచారణకు ఆదేశించామన్నారు.

Update: 2024-12-29 13:31 GMT

హైదరాబాద్ ఓఆర్ఆర్ ను అమ్ముకున్నవాళ్లపై విచారణకు ఆదేశించామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ధాటించారు. ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7,300 కోట్లకు ఓఆర్ఆర్ ను అమ్ముకుందని ఆయన ఆరోపించారు.‘‘హరీష్ రావుకు, మామ మీదనో, బామ్మర్ధి మీదనో కోపం ఉంది.. అందుకే అసెంబ్లీలో ఓఆర్ఆర్ పై విచారణకు డిమాండ్ చేశారు’’అని కోమటిరెడ్డి చెప్పారు.ఈ ఫార్ములా రేసులో ఒకరో, ఇద్దరు జైలుకు పోతారని మంత్రి జోస్యం చెప్పారు.

ఆ నాడు రాజశేఖర్ రెడ్డి జైకా సంస్థ ద్వారా రూ.6,500 కోట్ల రూపాయల రుణం తెచ్చి మూడేళ్లలో ఓఆర్ఆర్ ను నిర్మించారని, అక్కడే 24 నెలల్లో శంషాబాద్ లో ఎయిర్ పోర్టును నిర్మించి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని మంత్రి గుర్తు చేశారు.‘‘కేసిఆర్ మొన్న ఎలక్షన్ల ముందట ఓఆర్ఆర్ ను రూ. 7300 కోట్లకు అమ్మేసిండు.ఓఆర్ఆర్ నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.6,500 కోట్లు అయితే, అక్కడ భూమి విలువ లక్ష కోట్లుంటే.. కేవలం రూ. 7,300 కోట్లకు కేసిఆర్ అమ్ముకోవడం దారుణం’’అని కోమటిరెడ్డి ఆరోపించారు.

మూడేళ్లలో ఆర్ఆర్ఆర్ నిర్మిస్తాం
ఆర్ఆర్ఆర్ ను కేసిఆర్ ఆరు సంవత్సరాలు పెండింగ్ లో పెట్టిండని, కానీ తాము వచ్చే మూడేళ్లలో ఆర్ఆర్ఆర్ ను నిర్మిస్తామని కోమటిరెడ్డి ప్రకటించారు. వారం రోజులు ఢిల్లిలో ఉండి నితిన్ గడ్కరీ ని కలిసి అడిగితే 20 రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు.. పిలిచారని మంత్రి చెప్పారు.50 శాతం తెలంగాణను నగరీకరణ చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్డు అని చెప్పారు.


Tags:    

Similar News