కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ వస్తుంది.. నాదే బిగ్ రోల్ -కేసీఆర్

దేశంలో థర్డ్ ఫ్రంట్ వస్తుందని, అందులో కచ్చితంగా తాను ప్రధాన పాత్ర వహిస్తానని కేసీఆర్ తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

By :  Vanaja
Update: 2024-05-01 09:54 GMT

దేశంలో థర్డ్ ఫ్రంట్ వస్తుందని, అందులో కచ్చితంగా తాను ప్రధాన పాత్ర వహిస్తానని కేసీఆర్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలుస్తుందని ధీమాగా చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ, కాంగ్రెస్ లతో తమ పోరాటం కొనసాగుతుందని ఏఎన్ఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఒక్క లోక్ సభ సీటు గెలవడం కూడా కష్టమని విమర్శలు వినిపిస్తున్న వేళ కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన సంకీర్ణ ప్రభుత్వం నినాదం ఎత్తుకోవడం చర్చకు దారి తీసింది. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే అవకాశం ఉందని కేసీఆర్ అన్నారు. ఇది అసంభవం కాదని, ముమ్మాటికి సాధ్యం అవుతుందని నొక్కి చెప్పారు. మరోవైపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, కూటమి ఏర్పాటుకి సారధ్యం వహించడానికి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు. మేము రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంటామని, కూటమిని లీడ్ చేస్తానని అన్నారు.

ఎన్డీయే కూటమికి 200 సీట్లు కూడా రావడం కష్టమన్నారు. ఇండియా కూటమి గెలుపుకి దరిదాపుల్లో కూడా లేదన్నారు కేసీఆర్. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబు కూడా నష్టపోతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుందని, అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమేనని కేసీఆర్ అన్నారు. నాకున్న సమాచారం ప్రకారం బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుంజుకున్నాయి.

"నా దృష్టిలో ప్రాంతీయ పార్టీలు ఒకేచోట పరిమితం కాకూడదు. విస్తరించాలి. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కూడా అందుకే. కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నాయి" అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.

Tags:    

Similar News