జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మార్పుపై స్పందించిన కేసీఆర్

జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడంపై కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ స్పందించారు.

By :  Vanaja
Update: 2024-06-28 13:46 GMT

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తో పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం కూడా కొనసాగింది. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నేతలతో ఎర్రవెల్లిలో ఫార్మ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... పార్టీ మారే నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదన్నారు.. తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా? అన్నారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. సంజయ్ రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీని వదిలి వెళ్లారన్నారు. 2001 లో పార్టీ పెట్టినప్పుడు సంజయ్ లేరన్నారు. మధ్యలో వచ్చినవారు మధ్యలోనే వెళ్తారన్నారు. అలాంటివారితో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని కేసీఆర్ కార్యకర్తలకి ధైర్యం చెప్పారు. "నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం" అని కేసీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే వ్యాఖ్యలు చేశారు.

కాగా.. అంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News