విడతలవారీగా కేసీఆర్ భేటీలు.. నేటితో రూమర్స్ కి చెక్ పడిందా?

కేసీఆర్ వరసగా రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.

By :  Vanaja
Update: 2024-06-26 13:56 GMT

కేసీఆర్ వరసగా రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎర్రవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. పార్టీ నుంచి భారీగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి జంప్ అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ వరుస భేటీలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో నేతల్లో భరోసా నింపేందుకు గులాబీ బాస్ రంగంలోకి దిగారు.

ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించడంతో బీఆర్‌ఎస్ బలం 39 నుంచి 33కి తగ్గింది. 20 మంది ఎమ్మెల్యేలు పైనే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్ లో చేరిపోతారంటూ ఇటీవల దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనే దానం తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఒక్కొక్కరిగా హస్తం గూటికి చేరారు.

అధిష్టానం అప్రమత్తం...

మున్ముందు మరింతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అవుతారనే వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తం అయింది. ఫిరాయింపులకు ఆదిలోనే ఆడ్డుకట్ట వేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ కి డిమాండ్ చేస్తూ, అవసరమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు పార్టీ నేతలతో బుజ్జగింపు కార్యక్రమాలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలోనే... కేసీఆర్ నిన్న, ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మంగళవారం ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, టి . ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.

రూమర్స్ కి చెక్ పడిందా..?

బుధవారం ఉదయం కూడా కేసీఆర్ మరికొందరు నేతలతో భేటీ అయ్యారు. అయితే నిన్న కొంతమంది నేతలు హాజరు కాకపోవడంతో వారంతా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారని, అందుకే అధినేత పిలిచినా వెళ్లలేదని ప్రచారం జరిగింది. కానీ పార్టీ మారతారని ఎవరి పేర్లైతే బలంగా వినిపించాయో.. నేడు ఆ నేతలు కూడా కేసీఆర్ ని కలిశారు. దీంతో రూమర్లకు చెక్ పెట్టినట్లు అయింది. కేసీఆర్ విడతల వారీగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కలుస్తున్నారనే ఇండికేషన్స్ వచ్చాయి.

కాగా, నేడు కేసీఆర్ మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజిని కూడా కేసీఆర్ తో సమావేశానికి హాజరయ్యారు.

ప్రలోభాలకు గురి కావద్దు.. వచ్చేది మన పార్టీనే...

కాంగ్రెస్ ప్రలోభాలకు గురి కావద్దని, రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారుతాయని కేసీఆర్ ఎమ్మెల్యేలకు హితబోధ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఎంతో కాలం పట్టదని, మళ్ళి వచ్చేది మన ప్రభుత్వమే అని భరోసా కల్పిస్తున్నారు. మున్ముందు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దిశానిర్దేశం చేస్తున్నారు. కాగా భేటీ అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పాలన సాగుతున్న తీరు వంటి చాలా అంశాలపై చర్చించామని, అవన్నీ అంతర్గత విషయాలని, బయటకు వెల్లడించలేమని తెలిపారు.

Tags:    

Similar News