కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా లాస్య నందిత కుటుంబసభ్యులనే బరిలో దింపాలని అధిష్టానం భావించింది. ఆమె సోదరి నివేదితని కంటోన్మెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ ప్రముఖులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న రెండో కుమార్తె నివేదితను అభ్యర్థిగా ఖరారు చేసిటన్లు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు.- File Photo pic.twitter.com/h9oidhbQ3L— BRS Party (@BRSparty) April 10, 2024
ఫిబ్రవరిలో పఠాన్ చెరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు విడిచింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్‌ను ప్రకటించగా.. బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.
సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు...
సిట్టింగ్ స్థానం కావడంతో ఉపఎన్నికలోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. లాస్య నందిత కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో సింపతీ ఓట్లు కూడగట్టుకోవచ్చని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే లాస్య నందిత సోదరి నివేదితకి టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో నివేదిత తండ్రి, దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మంచి గుర్తింపు ఉన్న లీడర్. సంవత్సరం తిరిగేలోపు తండ్రీకూతుళ్ల మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి, సాయన్న ఇమేజ్ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ గెలుపుకి సహకరిస్తాయా లేక అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ప్రజలు రూటు మార్చుకుని సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ కి అప్పజెబుతారా, లేదంటే బీజేపీకి ఓటేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.
ఈ నియోజకవర్గం నుండి సాయన్న 1994, 1999, 2004 మూడు సార్లు టీడీపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 లో టీడీపీ తరపున పోటీ చేసి గెలవగా, 2018 లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 37 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2023 ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఆయన కూతురు లాస్య నందితకి కంటోన్మెంట్ టికెట్ ఇవ్వగా.. ఆమె 17 వేల ఓట్ల మెజారితో అప్పటి బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్ పై విజయం సాధించారు. ఇటీవల యాక్సిడెంట్ లో ఆమె ప్రాణాలు కోల్పోగా కంటోన్మెంట్ ఉపఎన్నిక బరిలో ఆమె సోదరి నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలోకి వచ్చారు.
ప్రజలు సానుభూతితో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు పట్టం కడతారో... కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే...