ఖబడ్దార్ కాంగ్రెస్.. ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణలో రాజకీయాలు మహరసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.;

Update: 2025-01-22 06:58 GMT

తెలంగాణలో రాజకీయాలు మహరసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. దాడులు ఇలానే కొనసాగించే పనైతే కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఒక్కరికీ మేలు జరిగింది లేదని, అంతా నష్టపోయిన వారేనని ఆమె అన్నారు. బుధవారం ఆమె యాదగిరి గుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక తమ రౌడీ మూకలతో కాంగ్రెస్ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తప్పకుండా తగిన గుణపాఠం నేర్పుతారని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ. 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా.. జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు మాది. మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలి. పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? మూసీ నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారు. మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. మూసీని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారు. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు’’ అని విమర్శించారు.

‘‘అందుకే అనుసంధాన ప్రాజెక్టు వ్యయం రూ.7,500 కోట్లకు పెంచారు. రూ. 7,500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. కొండపోచమ్మ నుంచి మూసీ అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. మూసీ ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. పేద ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని.. వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక వేసుకున్నారు సీఎం’’ అని ఆరోపించారు.

‘‘యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలడానికి కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారు. ఫ్లోరైడ్‌ని నిర్మూలించిన ఘనత కేసీఆర్‌ది. అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదు’’ అని అన్నారు.

Tags:    

Similar News