Kavitha | ‘ప్రతి రైతుకు షరతులు లేని రైతు భరోసా అందించాలి’
తెలంగాణలో రైతు భరోసా అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు.;
తెలంగాణలో రైతు భరోసా అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. సంక్రాంతి పండుల నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందరనుందని, అర్హులైన ప్రతి రైతుకు ఖాతాలో జనవరి 14వ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. కాగా రైతులంతా కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దాంతో పాటుగా కొన్ని పంటలు వేసిన రైతులకే ఈ పథకం ఇవ్వనున్నట్లు కూడా చెప్పారు. కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి తుమ్మ నాగేశ్వర రావు తేల్చి చెప్పారు. అయితే రైతు భరోసా పథకం అమలుకు షరతులు పెట్టడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సీఎం రేవంత్ రెడ్డిపై గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు రైతు భరోసాకు షరతులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి రైతుకు షరతులు లేని రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాకు షరతులు, నిబంధనలు విధిస్తూ అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ చేస్తున్నారని మండిపడ్డారు కవిత. గురువారం నాడు తన నివాసంలో జరిగిన బోధన్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశమయ్యారు. ఈ సందర్బంగానే రైతు భరోసా పథకం అమలుపై ఆమె ఘాటుగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా నేతలకు దిశా నిర్దేశం చేశారు కవిత.
‘‘రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. ఇప్పటికే ప్రజా పాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడుతారా? కేసీఆర్ తన హయాంలో రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారు. రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది’’ అని మండిపడ్డారు.
విజయం గులాబీ జెండాదే
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఏడాది పాలనలోనే కాంగ్రెస్.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. దాంతో ప్రజలు ఆ పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... ఇప్పుడు రైతు భరోసాకు షరతులు విధించి దగా చేస్తున్నారు. హామీల అమలుపై ప్రతీ ఒక్కరు గళమెత్తాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. ముఖ్యంగా గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వివరించారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా నడవాలని సూచించారు. కేసీఆర్, తాము అండగా ఉంటామని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.