Kavitha | ‘కేసులకు భయపడేది లేదు.. పోరాటం ఆపేది లేదు’

రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-01-06 06:48 GMT

రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాను రూ.15వేలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ చివరికి రూ.12వేలకే రైతు భరోసాను పరిమితం చేసిందని, ప్రతి రైతుకు కాకుండా కొందరికి మాత్రమే ఇస్తామంటూ అన్నదాతలకు అన్యాయం చేసిందంటూ కవిత మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఇంద్రవెల్లి చేరుకున్న కవిత అక్కడి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీల పోరాట స్ఫూర్తి, ఉత్తేజంతో ముందుకు సాగుతామన్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసులు పోరాడారని, వారి బాటలో ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ తప్పుడు కేసులకు భయపడరని వెల్లడించారు. కేసీఆర్ తన హయాంలో తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కడుపులో పెట్టుకుని రక్షించుకున్నారని, ఆయన పాలనలో 4.5లక్షల పోడుభూములకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు కవిత. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఆదివాసి యోధులను గౌరవించుకున్నామని అన్నారు.

కేటీఆర్‌పై కేసు కక్ష సాధింపే

అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్‌పై నమోదైన కేసుపై ఘాటుగా స్పందించారు. అది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్చేనన్నారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం ఆపేది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరిగుతోంది. ఎన్నికల్లో ఇచ్చే హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ప్రజల పక్షాన గుంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది. ఏసీబీ కేసులతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. దానిని రూ.12 వేలకు కుదించి రైతులను మోసం చేశారు. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుంది. ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News