MLA Kaushik Reddy | ఎమ్మెల్యేపై దాడి కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్

కరీంనగర్ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను దూషిస్తూ దాడి చేసిన కేసులో నిందితుడైన పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.;

Update: 2025-01-13 14:49 GMT

కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ముగ్గురు మంత్రులు, అధికారుల సమక్షంలోనే తోటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను దూషిస్తూ, చేత్తో నెట్టారు. తనపై పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాష్ట్ర శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు.

- తమ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దాడి ఘటనపై అతని పీఏ కూడా కరీంనగర్ వన్ టౌన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. మరో వైపు అభివృద్ధి సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని ఆర్డీఓ మహేశ్వర్ కూడా ఫిర్యాదు చేశారు.
- గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేశం కూడా నాలుగో కేసు పెట్టారు. దూషించడం, దురుసుగా వ్యవహరించడం చేత్తో నెడుతూ మీద మీదకు రావడంపై మంత్రులు, తోటి ఎమ్మెల్యేలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ ఇన్ స్పెక్టరుపై కూడా గతంలో దురుసుగా వ్యవహరించి కేసులో ఇరుక్కున్నారు.
- అసెంబ్లీతోపాటు అధికారిక సమావేశాల్లోనూ దురుసుగా ప్రవర్తిస్తున్న పాడి కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అధికారిక సమావేశంలో ఇలా దురుసుగా వ్యవహరించిన ఎమ్మెల్యేని మొదటిసారి చూశానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి వైఖరిని జిల్లా మంత్రి శ్రీపాద శ్రీధర్ బాబు కూడా ఖండించారు. కౌశిక్ రెడ్డి సైకోలా వ్యవహరించారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు.
- సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు వన్ టౌన్ పోలీసులకు తరలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఓ టీవీ ఛానల్ లో చర్చావేదికలో పాల్గొని వస్తుండగా జూబ్లీహిల్స్ లో అడ్డుకున్న 35 మంది కరీంనగర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేపై దాడి చేయడం, అధికారిక కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై నాలుగు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News