గీత కార్మికుల ప్రాణాలకు 'కాటమయ్య' కవచం

సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రారంభించారు.

By :  Vanaja
Update: 2024-07-14 15:03 GMT

సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికుల కోసం కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రారంభించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాటిచెట్టు ఎక్కుతూ పట్టుతప్పినా కింద పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను గీత కార్మికులను పంపిణీ చేశారు. సేఫ్టీ మోకులను అక్కడే ఉండి వారితో చెక్ చేయించారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టుషాపులపై ఆరా తీశారు. గీత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచుతామని హామీ ఇచ్చారు. వనమోహోత్సవంలో తాటి, ఈత మొక్కలను పెంచుతామన్నారు. అనంతరం మంత్రులు, పార్టీ నేతలు, గీత కార్మికులతో కలిసి సీఎం రేవంత్ సహపంక్తి భోజనం చేశారు.

కాటమయ్య కవచంతో ప్రయోజనమేంటంటే...

ఎన్నో ఏళ్లుగా గీత కార్మికులు ఒకే విధమైన మోకు, ముత్తాదును ఉపయోగిస్తున్నారు. వాటితో తాటిచెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తూ జారితే కిందపడి ప్రాణాలు కోల్పోవడమో, కాళ్లు, చేతులు, నడుములు విరిగి మంచానికే పరిమితమయ్యేవారు. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి.

హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు. పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్ లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముత్తాదుతో పాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకుకు ఉండే సేఫ్టీ రోప్ ను వారి నడుముకు ధరించిన బెల్ట్ కు బిగిస్తారు. దీంతో తాటిచెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కిందపడకుండా ఆపేస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గీతకార్మికులందరికీ ఉచితంగా ఈ సేఫ్టీ మోకులు పంపిణీ చేసింది.

Tags:    

Similar News