సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో తిరుగుబాటు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యార్థులు తిరుగుబాటు చేశారు.

By :  Vanaja
Update: 2024-08-03 12:57 GMT

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో విద్యార్థులు తిరుగుబాటు చేశారు. నాచారంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల హాస్టల్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థినులు వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు.

బాలికలు రోడ్డుపై కూర్చొని ‘మాకు న్యాయం కావాలి’ అంటూ నినాదాలు చేశారు. అన్నం, కూరల్లో పురుగులు చాలాసార్లు గుర్తించినట్లు విద్యార్థులు తెలిపారు. ఆహారంలో పురుగులు పడుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని, అధికారులను బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని, పుస్తకాలు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. విద్యార్థులు నిరసన చేయడంతో, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆందోళన విరమించుకోలేదు.

ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు...

కాగా, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కలుషిత ఆహరంపై విద్యార్థులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా మార్పు రావడం లేదు. ప్రభుత్వ బడుల్లో కలుషిత ఆహరం తిని అనేక చోట్ల విద్యార్థులు ఆసుపత్రి పాలైనప్పటికీ పరిస్థితులు మెరుగుపడటం లేదు. ఆందోళన చేసినప్పుడు ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులిపేసుకుంటోంది. రోజూ రాష్ట్రంలో ఏదొక మూలన ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు సర్వ్ భోజనంపైన ఫిర్యాదులు వినిపిస్తూనే ఉన్నాయి.

అక్షయపాత్రతో సమస్యకి చెక్?

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు శుచిగా, పౌష్టికంగా ఆహరం అందించే ప్రక్రియకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ బడులకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్ అందించే పైలట్ ప్రాజెక్టు పురోగతిపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో ప్రతి రోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సీఎస్సార్‌ ఫండ్స్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో ఆదివారం ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నందున, ఆ అంశంపై పూర్తిగా అధ్యయనం చేయాలని సీఎం ఇస్కాన్ ప్రతినిధులు సూచించారు. కాగా, అక్షయపాత్ర ద్వారా అయినా కలుషిత ఆహరం సమస్యకి చెక్ పడుతుందేమో చూడాలి.

Tags:    

Similar News