Telangana | ఎస్సీ వర్గాల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో ఉప వర్గీకరణ కోసం డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.;

Update: 2025-02-04 14:39 GMT

ఎస్సీ వర్గాల వర్గీకరణకు జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలోని మూడు సిఫార్సులను తెలంగాణ శాసనసభ ఆమోదించింది.

ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణలో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 1వతేదీన తీర్పు వెలువరించడంతో రాష్ట్రప్రభుత్వం అమలుకు కార్యాచరణ ప్రారంభించింది.

ఎస్సీ వర్గీకరణకు మంత్రులతో కమిటీ
ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు వీలుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, డి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా సబ్ కమిటీని రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ నియమించాలని సిఫారసు చేసింది.

జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్
మంత్రివర్గ కమిటీ సూచనతో 2024 అక్టోబరు 11వతేదీన డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య న్యాయ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఎస్సీ కులాలు, ఉప కులాల హేతుబద్ధమైన వర్గీకరణకు వీలుగా జనాభా గణన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టింది. ఈ కమిషన్ ఎస్సీల్లోని ఉప కులాల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని పరిశీలించి సిఫార్సులు చేసింది. తెలంగాణలోని అన్నీ జిల్లాలను సందర్శించిన కమిషన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించింది.ప్రజల నుంచి 4750 , ఆన్ లైన్ ద్వారా 8681వినతులను కమిషన్ స్వీకరించింది.

కమిషన్ నివేదిక
ఎస్సీల్లో 59 కులాల ఆర్థిక పరిస్థితులు, ఉద్యాగ, విద్యా అవకాశాలను పరిశీలించిన కమిషన్ సమగ్ర నివేదికను రూపొందించింది. కమిషన్ 199 పేజీల నివేదికను సమర్పించింది.

కమిషన్ ప్రధాన సిఫార్సులు
ఎస్సీల్లోని 59 ఉప కులాలను 1,2,3 గ్రూపులుగా విభజించాలని జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ వన్ లో 15 కులాలకు చెందిన 3.2 శాతం జనాభా ప్రాతిపదికగా ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 2 లోని 18 ఉపకులాల ఎస్సీలు 62.74 శాతం ఉన్నా, వారు విద్యా, ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారని కమిషన్ గుర్తించింది. వీరికి విద్యా, ఉద్యోగాల్లో 9 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. మెరుగైన ప్రయోజనాలు పొందిన గ్రూప్ 3కి చెందిన 26 ఉప కులాలున్నాయని, వీరి జనాభా 33.96 శాతం ఉండగా వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఎస్సీ కమిషన్‌ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.

40 ఏళ్ల కల సాకారం
40 ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అసెంబ్లీలో చెప్పారు. 30 ఏళ్ల ఉద్యమానికి నేడు పరిష్కారం దొరికిందని, ఎస్సీ వర్గీకరణ వల్ల కొందరిలో భయం, అభద్రతాభావం కలుగుతోందన్నారు. వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, వర్గీకరణ వల్ల ఎవరి ప్రయోజనాలకు ఇబ్బంది కలగదని మంత్రి దామోదర్ స్పష్టం చేశారు.

నాకు ఆత్మసంతృప్తి కలిగించిన రోజు : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…నా రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇది,ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం… చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది’’అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నాం… ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది ’’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Tags:    

Similar News