ఇది నా వ్యక్తిగత ఇష్యూ - కౌశిక్ రెడ్డి

చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడు అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

By :  Vanaja
Update: 2024-09-13 14:23 GMT

చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడి నుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడు అని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడుకు మేలు చేసేందుకే రేవంత్ హైడ్రా కుట్ర పన్నారని అన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ పెట్టుబడిదారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, పెట్టుబడులన్నీ అమరావతికి తరలిపోయేలా ప్లాన్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, హైడ్రా వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు అని.. ఆయన ట్రాప్ లో పడి రేవంత్ పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపైనా కౌశిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొన్న హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు గజగజ వణుకుతున్నడు అని కౌశిక్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ రాక తప్పదు.. మీరు మాజీలు అవ్వుడు ఖాయం అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అరికెపూడి గాంధీ చెప్పినట్లు, ఇది కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీకి మధ్య జరుగుతున్న వ్యక్తిగత ఇష్యూ అని కౌశిక్ స్పష్టం చేశారు. నేను వ్యక్తిగతంగా గాంధీని అన్నాను తప్ప, ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర సెటిలర్లపై నాకు పూర్తి గౌరవం ఉంది. గత పదేళ్లలో కేసీఆర్ పాలనలో ఇలాంటి ఒక్క సంఘటన కూడా జరగలేదు.

ఇంకా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ఇంటి వద్ద సమావేశం అవుదామని అనుకున్నామన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను హౌస్ అరెస్టు చేశారన్నారు. "ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లామని నాతోపాటు శంభిపూర్ రాజు బయలుదేరారు. మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నాపై, నా ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రే.. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయాలని ఆదేశాలిచ్చారు. నాపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయింది. నేను చేసిన తప్పు ఏంటి...? అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి. ఆయన స్వయంగా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెబుతున్నారు. ఆయన భాషను సమాజం అంగీకరిస్తుందా?" అని కౌశిక్ ప్రశ్నించారు.

"నేను వుండే విల్లా సమూదాయంలో మొత్తం 69 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడే ఏపీ మంత్రి నారాయణ తదితర ఎమ్మెల్యేలు ఉంటారు. నా విల్లాపై దాడి చేసి సెక్యూరిటీ గేట్లు పగులగొట్టారు. గాంధీ రౌడీయిజం చూడటానికి మీకు ఓట్లు వేశారా? ఆయన నా ఇంటికి వచ్చి చేసింది ఏం లేదు. గాలికి పగిలిపోయే నా గేట్లు పగలగొట్టి వెళ్లిపోయారు. మా నాయకుడు కేసీఆర్ మాకు సంస్కారం నేర్పించారు. కరీంనగర్ నుండి నేను హైదరాబాద్ వచ్చానని అరికెపూడి గాంధీ అన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని గాంధీ అంటారు. కానీ ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి" అని కౌశిక్ రెడ్డి మీడియాకి వెల్లడించారు.

Tags:    

Similar News