జీవన్ రెడ్డి అలకతీర్చిన అమాత్యుడు!!

నాలుగైదు రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు.

By :  Vanaja
Update: 2024-06-27 10:33 GMT

నాలుగైదు రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. జగిత్యాలలో ఆయన ప్రత్యర్థి, బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజయ్ కుమార్ ని పార్టీలో చేర్చుకోవడంతో జీవన్ రెడ్డి అలకబూనారు. అప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికను తప్పుబట్టిన జీవన్ రెడ్డి, ఇక నియోజకవర్గంలో ఆయనపై గెలిచిన సంజయ్ కుమార్ ని పార్టీలోకి ఆహ్వానించడం ఆయనకి మరింత కోపాన్ని తెప్పించింది.

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కడం, పదవికి రాజీనామా చేస్తాననడంతో అధిష్టానం అప్రమత్తమైంది. బుజ్జగింపులు పర్వం మొదలుపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయనకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఫోన్ లో నచ్చజెప్పినా జీవన్ రెడ్డి కోపం చల్లారలేదు. దీంతో ఆయనని బుధవారం ఢిల్లీకి పిలిపించారు. రాత్రి ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల అనంతరం జీవన్ రెడ్డి అలక వీడినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

శ్రీధర్ బాబు సమన్వయంతో సమస్య పరిష్కారం...

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిన మాట వాస్తవమన్నారు. అయితే, మంత్రి శ్రీధర్ బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పాలనలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఆయన అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. ఎప్పటిలాగే జీవన్ రెడ్డి రైతుల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.

కేవలం జగిత్యాల నియోజకవర్గం కోసమే కాకుండా... జీవన్ రెడ్డి రైతుల కోసం కూడా కొట్లాడారని రేవంత్ అన్నారు. రైతు రుణమాఫీ, రైతుబంధు విషయంలో జీవన్ రెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపారు. జగిత్యాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని, బీఆర్ఎస్ ను కాపాడేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.

Tags:    

Similar News