IMD | ఇండియా తుపాన్ హెచ్చరికలకు 150 ఏళ్లు....
భారత వాతావరణ శాఖ 1875 వ సంవత్సరంలో ఏర్పాటైంది. నాడు తుపాన్ల జాడను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటైన ఐఎండీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.;
By : Shaik Saleem
Update: 2025-01-12 12:34 GMT
నాడు కోల్ కతా, చెన్నై కేంద్రాలుగా ఏర్పాటైన భారత వాతావరణ శాఖ కేంద్రాలను దేశవ్యాప్తంగా విస్తరించారు. వాతావరణ పరిస్థితులపై ఐఎండీ కేంద్రాలు వెదర్ బులెటిన్లను విడుదల చేసేవారు. సముద్రంలో ఏర్పడిన తుపాన్ల జాడను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసేందుకు మొదట కోల్ కతా, చెన్నై కేంద్రాలుగా ఐఎండీ శాఖలు ఏర్పాటయ్యాయి.
- అనంతరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో వెదర్ అబ్జర్వేటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం సిమ్లా, పూణే నగరాల్లో ఐఎండీ కేంద్రాలను నెలకొల్పారు.
- తుపాన్లు, భారీవర్షాలు, ఉష్ణోగ్రతలపై ఎప్పటికప్పుడు వెదర్ బులిటెన్లను జారీ చేసేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఐఎండీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐఎండీ కేంద్రాలను ఆటోమేషన్ చేయడం ద్వారా ప్రతీ 10 నిమిషాలకు వాతావరణ పరిస్థితులపై శాస్త్రవేత్తలు బులిటెన్లను విడుదల చేస్తున్నారు.
- భారత వాతావరణ శాఖ ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉత్సవాలు జరుపుకుంటోంది. వాతావరణం కోసం రన్, ఓపెన్ హౌస్, సెమినార్ నిర్వహించారు. వాతావరణ శాఖ కేంద్రం డిజాస్టర్ మేనేజ్ మెంట్, వెదర్ సేవలపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
వాతావరణ శాఖ చరిత్ర
భారతదేశంలో వాతావరణ శాస్త్రం పురాతన కాలం నుంచే ఉంది. పురాతన యుగంలో మేఘాలు,వర్షం, సూర్యుని చుట్టూ భూమి కదలికల వల్ల సంభవించే కాలానుగుణ చక్రాల ప్రక్రియల గురించి చర్చలు జరిగాయి. 500ఏడీలో వరాహమిహిర శాస్త్రీయ రచన వాతావరణ ప్రక్రియల గురించి వివరించింది.నాడు కాళిదాసు ఏడవ శతాబ్దంలో రచించిన తన ఇతిహాసం 'మేఘదూత్'లో మధ్య భారతదేశంలో రుతుపవనాల ప్రారంభ తేదీని కూడా పేర్కొన్నాడు.
పురాతన కాలం నాటి నుంచి...
వాతావరణ శాస్త్రం 17వ శతాబ్దంలో థర్మామీటర్, బేరోమీటర్,వాతావరణ వాయువుల ప్రవర్తనను నియంత్రించే విధానం అమలులోకి వచ్చింది. 1636వ సంవత్సరంలో బ్రిటీష్ శాస్త్రవేత్త హాలీ భారతీయ వేసవి, రుతుపవనాలపై గ్రంథంలో పేర్కొన్నారు.దేశంలో పురాతన వాతావరణ పరిశీలనా కేంద్రాలున్నాయి. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాతావరణ స్టేషన్లను స్థాపించింది. దేశంలోని వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి 1785వ సంవత్సరంలో కోల్ కత్తాలో, 1796లో మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వాతావరణ కేంద్రాలు
ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ 1784లో కోల్ కత్తాలో, 1804వ సంవత్సరంలో బొంబాయిలో (ప్రస్తుతం ముంబై) వాతావరణ కేంద్రాలను స్థాపించారు. కోల్ కత్తాలోని కెప్టెన్ హ్యారీ పిడింగ్టన్ 1835-1855 సమయంలో జర్నల్ ఆఫ్ ది ఆసియాటిక్ సొసైటీలో ఉష్ణమండల తుపాన్ల గురించి 40 పత్రాలను ప్రచురించారు.19వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో దేశంలో ప్రాంతీయ ప్రభుత్వాల ఆధ్వర్యంలో వాతావరణ అబ్జర్వేటరీలను ఏర్పాటు చేశారు.
1864 కోల్ కతా తుపాన్
1864వ సంవత్సరంలో తుపాన్ కలకత్తాను తాకింది. దీని తర్వాత 1866, 1871లో రుతుపవనాల వైఫల్యాలు సంభవించాయి. అనంతరం 1875వ సంవత్సరంలో భారత ప్రభుత్వం భారత వాతావరణ శాఖను స్థాపించింది. దేశంలోని అన్ని వాతావరణ పనులను కేంద్ర అధికారం కిందకు తీసుకువచ్చింది. బ్లాన్‌ఫోర్డ్ భారత ప్రభుత్వానికి వాతావరణశాఖ రిపోర్టర్‌గా నియమితులయ్యారు. అబ్జర్వేటరీల మొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ ఎలియట్ మే 1889లో కలకత్తా ప్రధాన కార్యాలయంలో నియమితులయ్యారు. IMD ప్రధాన కార్యాలయం సిమ్లాకు, తర్వాత పూనాకు (ప్రస్తుతం పూణే) చివరకు న్యూఢిల్లీకి మార్చారు.
జనవరి 14,15 తేదీల్లో ఉత్సవాలు
జనవరి 14-15 తేదీల్లో భారత వాతావరణ శాఖ 150 ఏళ్ల చారిత్రాత్మక మైలురాయిని స్మరించుకోవడానికి ఉత్సవాలు చేపట్టింది.వాతావరణంపై శాస్త్రీయ ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్ ఐఎండీ కేంద్రం సైన్స్ ఎక్స్‌పోలు, సెమినార్లు నిర్వహిస్తోంది. ఐఎండీ ఉష్ణమండల వాతావరణ శాస్త్ర అభివృద్ధిలో ముందంజలో ఉందని,గత శతాబ్దంన్నర కాలంగా వాతావరణంపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిందని హైదరాబాద్ ఐఎండీ కేంద్రం ఇన్ చార్జి నాగరత్న చెప్పారు.
- భారత వాతావరణ శాఖకు 150 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. నేడు దేశంలో తుపాన్లు అయినా, భారీవర్షాలైనా, విపత్తులైనా, పిడుగులు పడే పరిస్థితులున్నా ఐఎండీ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తుంది.