టార్గెట్ GHMC... టీడీపీతో ఏ పార్టీకి లాభం?

తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని పునరుద్ధరించడానికి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

By :  Vanaja
Update: 2024-07-09 13:05 GMT

ఉభయ తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై చర్చించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 5 న హైదరాబాద్ కి వచ్చారు. ఆరవ తారీఖున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారులు ప్రజాభవన్ లో భేటీ అయ్యారు. చర్చలు జరిపారు. ఎవరి డిమాండ్స్ వాళ్ళు లేవనెత్తారు. ఇది ఒక్క భేటీతో తేలే అంశం కాదనే అభిప్రాయానికి వచ్చారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇంతవరకు ఒక కోణం. ఇప్పుడు విభజన సమస్యల పరిష్కారం కంటే ఎక్కువగా మరో చర్చ మొదలైంది. అదే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనం. ఇది ఇంకో కోణం.

ఏపీ లో నాల్గవసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ కి వస్తున్న చంద్రబాబు నాయుడికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నగరమంతా చంద్రబాబుకి స్వాగతం పలుకుతూ హోర్డింగులు, బ్యానర్లతో పసుపుమయం చేశారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ లో అభినందన సభలు, తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... తెలంగాణలో పార్టీని బలోపేతం చెయ్యాలా వద్దా తమ్ముళ్లూ అని శ్రేణుల్ని అడిగారు. చేయాల్సిందే అంటూ బలంగానే ప్రతిస్పందన వచ్చింది. ఇక చంద్రబాబు కూడా తెలంగాణలోనూ పార్టీపై ఫోకస్ చేస్తా అని 'తెలుగు' తమ్ముళ్ళకి భరోసా ఇచ్చారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే టార్గెట్...

ఈ క్రమంలో తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని పునరుద్ధరించడానికి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీలో గెలుపు జోష్ లో ఉన్న చంద్రబాబు... తెలంగాణలో పార్టీని తిరిగి నిలబెట్టడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పైగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల అదృష్టమేమిటన్నదే తీవ్ర చర్చనీయాంశమైంది. సెటిలర్ సెగ్మెంట్లలో కొంత మేర లబ్ధి పొందవచ్చని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీతో బీఆర్ఎస్ పొత్తు?

జీహెచ్‌ఎంసీలో వైసీపీకి కొంత పట్టు ఉంది. వైసీపీ పోటీలో నిలబడితే... టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నప్పటికీ ఓట్లు చీలి BRSకి హెల్ప్ అవుతుంది. ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా నివసించే ఆరు నుంచి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 నుంచి 30 డివిజన్లలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ వైసీపీతో పెట్టుకునే అవకాశాలు ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఎవరి ప్రాభవం ఎంత?

2002లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 99 స్థానాలకు గాను టీడీపీ- 22, AIMIM - 34, కాంగ్రెస్- 22, బీజేపీ- 18, టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)- 2, ఎంబీటీ- 2, తెలంగాణ సాధన సమితి- 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. కానీ 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాల్లో కాంగ్రెస్ 52, టీడీపీ 55, ఏఐఎంఐఎం 43, బీజేపీ 5, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2016 ఎన్నికల్లో బీఆర్ఎస్ 99, ఏఐఎంఐఎం 44, బీజేపీ 4, టీడీపీ 1, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. 2020లో బీఆర్ఎస్- 56, ఏఐఎంఐఎం- 44, బీజేపీ- 47, కాంగ్రెస్- 3, టీడీపీ- సున్నా.

పట్టున్న ప్రాంతాలపై టీడీపీ ఫోకస్...

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ లో టీడీపీకి ప్రాతినిథ్యం లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీ పునరాగమనం చేయాలని భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణపై టీడీపీ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఉత్సాహంలో ఉన్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, సనత్ నగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉందని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన వారిలో చాలా మంది గతంలో టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నవారే కావడం విశేషం.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో రోజురోజుకూ ఆ పార్టీ బలహీనపడుతోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80 శాతం మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులు అయ్యి ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు విధేయతను మార్చుకున్నారని, కానీ క్యాడర్ మారలేదని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తారనిపిస్తోంది.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

తెలంగాణాలో మళ్ళీ అడుగు పెట్టాలన్న చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు గెలుచుకోగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లలోని మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. నగరంలో పార్టీకి బలమైన ఓటర్లు కూడా ఉన్నారు. ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పార్టీ హైకమాండ్ వ్యూహాలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పని చేస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం ఎలా ఉండనుంది అని తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ భవితవ్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో భాగ్యనగరంలో పార్టీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించవలసి వచ్చింది. మరోవైపు, నగరంలో బీఆర్‌ఎస్‌కు కూడా గణనీయమైన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిల్చుంటే పోటీ రసవత్తరంగా ఉంటుంది. 

Tags:    

Similar News