ఆర్ కృష్ణయ్యతో ఎంపీ రవి భేటీ.. తన లక్ష్యం ఏంటో చెప్పిన మాజీ ఎంపీ..

ఎంపీ పదవికి రాజీనామా చేసిన కృష్ణయ్య.. పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ కావడం విశేషంగా మారింది. తన జీవిత ధ్యేయం బీసీల న్యాయమేనని ఆయన చెప్పారు.

Update: 2024-09-25 10:00 GMT

రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అనూహ్యంగా తీసుకున్న రాజీనామా నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారింది. పిలిచి సీటు ఇచ్చినందుకు వైసీపీకి తగిన శాస్తి చేశారంటూ కొందరు నిష్ఠూరమాడుతున్నారు. కానీ ఎంపీ పదవిని వదులుకున్న కృష్ణయ్య మాత్రం వరుస భేటీలతో కాస్తంత బిజీ రోజును గడుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన తెలంగాణ ఎంపీ మల్లు రవితో భేటీ అయ్యారు. వీరిద్దరు కలవడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. వీరిద్దరు కలవడం వెనక ఆంతర్యం ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కృష్ణయ్య.. కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారా? లేదా కృష్ణయ్యాను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడానికి మల్లు రవి ఆసక్తిగా చూపుతున్నారా అనే ప్రశ్నలకు తెగ వినిపిస్తున్నాయి. కానీ కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను పదవికి రాజీనామా చేశానని, రాజకీయ లబ్ధి పొందడానికి కాదని కృష్ణయ్య ఇప్పటికే తన రాజీనామాకు గల కారణాన్ని వివరించారు. గ్రామ స్థాయికి చేరిన బీసీ ఉద్యమాన్ని మళ్ళీ పరుగులు పెట్టిస్తామని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లభించేలా పోరాటం కొనసాగిస్తానని ఆయన చెప్పారు. వందకు పైగా బీసీ సంఘాల ప్రతినిధులతో చర్చించి రాజ్యసభకు రాజీనామా చేసినట్టు చెబుతున్న కృష్ణయ్య పార్టీ నుంచి ఫిరాయించే విషయమై ఇంకా చర్చించాల్సి ఉందని న్యూఢిల్లీలో విలేకరులకు తెలిపారు.

అదే నా లక్ష్యం..

దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు న్యాయం జరగేలా చేయడమే తన ధ్యేయమని, అందుకోసం చివరి శ్వాస వరకు పోరాడతానని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివిధ పద్దతుల్లో ఉద్యమం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏదీ కూడా బీసీలకు న్యాయం చేయడం లేదు. బీసీల పరిస్థితులపై చట్టసభల్లో ప్రశ్నించినా సమాధానం రావడం లేదు. ప్రజా సభల్లోనే ప్రశ్నించాలని నిర్ణయించుకున్నా. అందుకే నాలుగేళ్ల పదవీకాలం ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేశాను. ప్రజా ఉద్యమం, బీసీ ఉద్యమమే నా భవిష్యత్ కార్యాచరణ. రాజ్యాధికారంలో వాటాతో పాటు చట్టసభల్లో 50 రిజర్వేషన్లను బీసీలకు అందివ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లే ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలి. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలు పాల్గొనాలి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే నా జీవిత లక్ష్యం. ఇందుకోసం ప్రతి బీసీ బిడ్డ పోరాడాలి’’ అని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య.

నావంతు సహకారం: తీన్మార్ మల్లన్న

ఈ క్రమంలోనే ఆర్ కృష్ణయ్యను తీన్మార్ మల్లన్న కూడా కలిశారు. బీసీల అభ్యున్నతి కోసం ఆయన పడుతున్న శ్రమకు మెచ్చుకున్నారు. ఆయన చేస్తున్న బీసీ ఉద్యమంలో తానూ భాగమవుతానని, అన్ని విధాలు ఉద్యమాన్న విజయవంతం చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని తీన్మార్ మల్లన్న చెప్పారు. ఈ సందర్భంగానే ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారని, అందుకు కృష్ణయ్య ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదని సమాచారం. పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా బీసీల అభివృద్ధి కోసం పాటు బడాలని, బీసీలకు అడుగడుగా అన్యాయమే జరుగుతుందని, దాని నుంచి వారిని బయటపడేలా చేసి వారికి న్యాయం అందిచే వరకు ఉద్యమం కొనసాగాలని అన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ వైపు కృష్ణయ్య చూపు

కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ బలం 11 నుంచి 8కి పడిపోయింది. కృష్ణయ్య జూన్ 2022లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగుస్తుంది. జాతీయ ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య 2014లో ఎన్నికల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎల్‌బీనగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2022లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. జగన్ తరఫున ఏలూరులో పెట్టిన బీసీల మహాసభకు హాజరై వైసీపీని పొగిడారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకుంటున్నట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News