HYDRAA | హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఆక్రమణలు తొలగిస్తామన్న రంగనాథ్..

గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు పరిరక్షణ కోసం హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-04 07:11 GMT

గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటలు పరిరక్షణ కోసం హైడ్రా(HYDRAA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాటి రక్షణకు మరింత కట్టుదిట్టమైన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో విపత్తు నిర్వహణ, వాతావరణ ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే చెరువుల పరిరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇకపై గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నట్లు వెల్లడించింది హైడ్రా. 2025 నుంచి ప్రతి సోమవారం రోజున బుద్ధభన్‌లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపడతామని, వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపింది హైడ్రా. ఇకపై ప్రతి ఒక్కరూ కూడా చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా తెలిపింది.

రంగనాథ్ ఏమన్నారంటే..

‘‘నగరంలో వరద ముప్పును అధిగమించేందుకు హైడ్రా సరైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే చెరువుల పునరుద్ధరణ, వాటి అనుసంధానంపై దృష్టి పెట్టాం. వర్షా కాలం వరద ముప్పు లేని నగరాలు అనే అంశం పెద్ద సవాల్‌గా మారింది. రెండు సెంటీమీటర్ల వర్షం పడినా నగరంలో వరద ముంచెత్తి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. దీంతో ఇంధనంతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. వాహన కాలుష్యం పెరిగిపోతోంది. ఇండియా వర్షపాతం 118 సెంటిమీటర్లయితే తెలంగాణ 130 సెంటీమీటర్లుంది. హైదరాబాద్‌లో 89 సెంటీమీటర్ల నమోదు అవుతున్నా.. ఒకేసారి ఎక్కువ మొత్తం వర్షం పడడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి’’ అని తెలిపారు రంగనాథ్.

‘‘నగరంలో కేవలం 0.95 శాతం వర్షం నీరు మాత్రమే భూమిలోకి ఇంకుతోంది. నివాస ప్రాంతాలు పెరగడం, చెరువులు, నాలాలు కబ్జాకు గురి కావడం, వరద కాలనీలను, రహదారులను ముంచెత్తుతోంది. అందుకే చెరువుల పునరుద్ధరణ చేపట్టాం. నాలాల ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టాం. పార్కులను, ప్రభుత్వ స్థలాలను కాపడుతున్నాం. వరద కాలువలను పునరుద్ధరించి గొలుసుకట్టు చెరువులను పునరుద్దరిస్తాం. చెరువుల చుట్టుకొలత లెక్కలు తేల్చే పనిలో ఉన్నాం. ఈ క్రమంలో వాతావరణ శాఖ సహకారం ఎంతో అవసరం. ప్రస్తుతం వెదర్ రాడార్ ఒక్కటే ఉంది. వీటి సంఖ్య పెంచాలి. అలాగే 157 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి వాటి సంఖ్య రెట్టింపు కావాలి. ఇలా సాంకేతికతను అందిపుచ్చుకొని.. వర్షం రాకను, ఎంత మొత్తంలో వస్తోంది.. ఏయే ప్రాంతాలకు వరద ముప్పు ఉంటుంది అనే సమాచారం ప్రజలకు కచ్చితంగా అందేలా చూడాలి. ఈ సమాచారంతో ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది’’ అని రంగనాథ్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News