HYDRAA | వెదర్ అలర్ట్ కోసం హైడ్రా ఎఫ్ఎం ఛానల్,2025 రోడ్ మ్యాప్

హైడ్రా 2025వ సంవత్సరంలో దూకుడు ప్రదర్శించనుందా అంటే అవునంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.రాబోయే 2025వ సంవత్సరానికి రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు.

Update: 2024-12-28 13:46 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) రాబోయే 2025వ సంవత్సరంలో చెరువుల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కొత్త సంవత్సరంలో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం వెల్లడించారు.


వాతావరణ పరిస్థితులపై అలర్టులు...హైడ్రా ఎఫ్ఎం ఛానల్
వచ్చే ఏడాది హైదరాబాద్ మహా నగర పరిధిలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వీలుగా ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాస్త్రవేత్తలతో సాంకేతిక విభాగాన్ని హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.దీనికోసం ప్రత్యేకంగా హైడ్రా ఎఫ్ఎం ఛానల్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. హైడ్రా ఎఫ్ఎం ఛానల్ ద్వారా వాతావరణం అంచనాలు, అలర్ట్ లు జారీ చేయనున్నారు.

ట్రాఫిక్‌ విధుల్లో...

మహానగరంలోని చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్స్, బఫర్ జోన్లలో ఆక్రమణలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకురావాలని హైడ్రా నిర్ణయించింది. ఏదైనా భూమిని కొనుగోలు చేసే ముందు ప్రజలు వివరాలు తెలుసుకోవాలని కోరనున్నారు.చెరువుల ఆక్రమణలను హైడ్రా వచ్చే ఏడాది తనిఖీలు చేయనుంది.హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్‌లలో 100 మంది డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్‌ విధుల్లో నియమించనున్నారు.

ఆస్తులు కొనేముందు జాగ్రత్తలు తీసుకోండి
భూములు, భవనాలు, ఆస్తులు కొనేటపుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కోరింది. నోటరీ చేసిన, రిజిస్ట్రేషన్ లేకుండా, అనధికార నిర్మాణాలు కొనకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ ప్రాంతంలోని పార్కులు, బహిరంగ ప్రదేశాలు, రోడ్లు,అనధికారిక నిర్మాణాలు మొదలైన వాటిపై అక్రమంగా ఆక్రమించడంపై హైడ్రా ప్రచారం చేయనుంది.ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని షెడ్‌లు, ఇతర నిర్మాణాలు అనధికారికంగా ఉండడంతో వాటిని కూల్చివేసే అవకాశం ఉందని హైడ్రా ప్రకటించింది.

నెలరోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్
వచ్చే నెల రోజుల్లో హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది హైడ్రా 8 పార్కులు, 12 చెరువులు, నాలుగు ప్రభుత్వ స్థలాలతో కలిపి మొత్తం 200 ఎకరాల భూమిలో ఆక్రమణలను తొలగించి పరిరక్షించింది.చెరువులు, కుంటలు, సరస్సుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ను నిర్ణయించి సరిహద్దు రాళ్లు వేసింది.మహానగరంలో సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లు, గ్రామ మ్యాపులు, రెవెన్యూ రికార్డులు, శాటిలైట్ చిత్రాల, ఏరియల్ చిత్రాల సాయంతో 1025 చెరువులున్నాయని హైడ్రా గుర్తించింది. ఖాస్రా పహాణిలు, సరస్సులు, కుంటలు, చెరువులను గుర్తించారు. చెరువులను ఆక్రమించేందుకు నిర్మాణ వ్యర్థాలను వేస్తే వాటిని డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది. పార్కులు, ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్ వేసి కాపాడాలని నిర్ణయించారు. డీఆర్ఎఫ్ శిక్షణ కేంద్రాన్ని నాగోలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

12 చెరువుల పునరుజ్జీవం
హైదరాబాద్ మహానగరంలో 12 చెరువుల్లో ఆక్రమణలను తొలగించి నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భజల మట్టాన్ని పెంచాలని హైడ్రా సంకల్పించింది. గుట్టల బేగంపేటలోని సున్నంచెరువు, బాచుపల్లిలోని ఎర్రకుంట, మాదాపూర్ లోని తుమ్మిడికుంట, చందానగర్ లోని ఈర్ల చెరువు, కూకట్ పల్లిలోని నాలా చెరువు, ఉప్పల్ లోని నల్ల చెరువు, అంబర్ పేటలోని బతుకమ్మకుంట, ఖాజాగూడలోని తౌటానికుంట, రాజేంద్రనగర్ లోని భూంరఖ్ దౌలా చెరువు, గగన్ పహాడ్ లోని అప్పా చెరువు, తార్నాకలోని ఎర్రకుంట, దుండిగల్ లోని కట్వా చెరువులను పునర్జీవం చేయనున్నారు.

హైడ్రా కూల్చివేతలు ఆగవు
హైడ్రా కూల్చివేతలు ఆగవని కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందని, ఎఫ్టీఎల్ గుర్తించిన తర్వాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయని ఆయన తెలిపారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయని, హైడ్రా నోటీసులు ఇవ్వదని, వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.హైడ్రాకు ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో ఎక్కువ భాగం పరిష్కరించామని కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరించారు.



Tags:    

Similar News