ట్రంప్ ప్రమాణం వేళ, వాషింగ్టన్ లో హైదరాబాద్ విద్యార్థి కాల్చివేత
ఉన్నత చదువుల కోసమనో, ఉన్నతమైన భవితకోసమనో అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్న భారతీయుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది.;
అమెరికా నూతన అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణం చేయనున్న వేళ వాషింగ్టన్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపింది ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆ కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు రవితేజ మరణించారు. ఆయన అక్కడ ఎందుకున్నారనే దానిపై కూడా స్పష్టత రాలేదు. పోలీసులు ఇంకా అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. చనిపోయారని మాత్రమ ప్రకటించారు.
కాల్పుల్లో మరణించిన రవితేజ హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందినవారు. తండ్రి కొయ్యాడ చంద్రమౌళి అని తెలిసింది. ఆయన కుమారుడు రవితేజ రెండేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అతడి మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వాషింగ్టన్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వార్తను తెలుసుకున్న అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రవి తేజ తండ్రి కె. చంద్రమౌళి మీడియాతో మాట్లాడుతూ, "ఏ తండ్రికీ ఈ పరిస్థితి రావద్దు, నా కొడుకు ఎలా వెళ్లాడో, ఎలా తిరిగి వస్తున్నాడో," అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆందోళన కలిగిస్తున్న దాడులు..
అమెరికాలో తెలుగు ప్రజలపై హింసాత్మక ఘటనల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఘటన అమెరికాలో తెలుగు విద్యార్థుల భద్రతపై ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ (NAAIS) ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ, "హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల రవి తేజ తన MBA చదువుకోడానికి 2022లో అమెరికాకు వచ్చాడు. కానీ వాషింగ్టన్ DCలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది," అని పేర్కొంది.
కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తీవ్రంగా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి విదేశాంగ మంత్రిత్వ శాఖపై విమర్శలు గుప్పించింది. "విదేశాల్లో భారత విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది?" అంటూ ప్రశ్నించింది. "ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల కలలు కరిగిపోతున్నాయని, ప్రభుత్వ అలసత్వం వారి జీవితాలను ప్రమాదంలో పడేస్తోంది" అని NSUI ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవలి హింసాత్మక ఘటనలు...
2023 డిసెంబర్‌లో భారతీయ సంతతికి చెందిన సంత్రా సాజు న్యుబ్రిడ్జ్ వద్ద నీటిలో మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల హత్య ఘటన ఇంతకుముందు కలకలం రేపింది. 2024 మార్చిలో అమెరికాలోని బోస్టన్ లో అభిజీత్ పర్చూరి అనే విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలు విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. విదేశాల్లో భారతీయ విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని, ఇండియన్ స్టూడెంట్స్ పై దాడులను అరికట్టేలా అమెరికా సహా ఇతర దేశాల అధికారులతో చర్చలు జరపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. నష్టపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు మానసిక ధైర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.