ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేగా హైదరాబాద్-విజయవాడ రహదారి విస్తరణ
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ పట్టనుంది.హైదరాబాద్ –విజయవాడ జాతీయరహదారి-65ని ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ హైవేగా విస్తరించనున్నారు.
By : Shaik Saleem
Update: 2024-11-18 14:55 GMT
హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారి-65ని ఆరు వరుసల ఎక్స్ ప్రెస్ హైవేగా విస్తరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. విస్తరణ ప్రస్తుతం ఈ రోడ్డు విస్తరణకు సంబంధించిన డీపీఆర్ పూర్తయ్యే స్టేజీలో ఉంద మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. దీంతో హైదరాబాద్ –విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. తద్వారా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళతారని ఆయన వివరించారు.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగిరం
హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారి-163 పరిధిలో నిర్మిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పది నెలల్లోనే 50 శాతం పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నారపల్లి వరకు 5 కిలోమీటర్ల ఫ్లైఓర్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని ఆయన తెలిపారు.వచ్చే మార్చి నెలాఖరుకల్లా సర్వీస్ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. శ్రీశైలం ఏరియాలో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
త్వరలో ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణపనులు
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలనుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీకి, ఎయిర్ పోర్ట్ కు ఈ రోడ్డు ద్వారా కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, లాజిస్టిక్, మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించిన మంత్రి
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి వెంకటరెడ్డి పరిశీలించారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పనులు పూర్తి చేసేలా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు.
మామునూర్ ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేస్తాం
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్ ఎయిర్ పోర్ట్ ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.మామునూర్ ఎయిర్ పోర్ట్ ను రాబోయే 8 నెలల కాలంలో ప్రారంభం చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్ట్ ను భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.