'లిక్కర్ కేసులో కవితని తప్పించేందుకు ఫోన్ ట్యాపింగ్'

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

By :  Vanaja
Update: 2024-05-27 12:51 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పలువురు రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆయన హైదరాబాద్ పోలీసుల ఎదుట అంగీకరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి విస్మయం కలిగించే అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్టోబర్‌, 2022 లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరినపుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయనను ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.


దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలని కేసీఆర్ అనుకున్నారని రాధాకిషన్ రావు తెలిపారు. అదే సమయంలో పైలెట్ రోహిత్‌ రెడ్డి తోపాటు పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేర్చుకోవాలని కమలం అగ్రనేతలను సంప్రదించినట్టు తెలిసింది. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారిపై సర్వైలెన్స్ పెట్టాలని కేసీఆర్, ఎస్ఐబీకి చెప్పినట్టు రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై అప్పటి ఎస్ఐబీ చీఫ్‌ ప్రభాకర్ రావు తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్‌ లను ప్రణీత్‌ రావు బృందం ట్యాప్‌ చేసినట్టు రాధాకిషన్‌ రావు వెల్లడించారు. అలా ట్యాప్‌ చేసిన ఒక ఆడియో టేప్‌ కేసీఆర్ కి పంపినట్టు చెప్పారు. ఆ తర్వాతే కేసీఆర్‌ అందరినీ ట్యాప్ చేయాలని ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్పై కెమెరాల కోసం టాస్క్‌ఫోర్స్ టీంను ఢిల్లీ పంపామని, బీజేపీ పంపిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేయడానికి ఒకరోజు ముందే ఫామ్‌ హౌస్‌ లో కెమెరాలు అమర్చామని వెల్లడించారు.


ఈ ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులకు అప్పగించామని రాధాకిషన్‌ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌ ను అరెస్టు చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు వెల్లడించారు. బీఎల్ సంతోష్‌ ను అరెస్టు చేస్తే ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుదామని భావించినట్టు రాధాకిషన్‌ రావు వివరించారు.

అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్‌ ను అరెస్ట్‌ చేయలేకపోయామని చెప్పారు. పలువురు అధికారులను కేరళకు పంపించినప్పటికీ ప్లాన్ ని విజయవంతంగా అమలు చేయలేదన్నారు. సంతోష్‌ ను అరెస్టు చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు రాధాకిషన్‌ పేర్కొన్నారు. 

Tags:    

Similar News