Hyderabad | హైదరాబాద్‌లో కొత్తగా మెట్రో,ఎలివేటెడ్, రేడియల్ రోడ్లు

హైదరాబాద్‌లో మెట్రో,ఎలివేటెడ్, రేడియల్ రోడ్ల నిర్మాణానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తోంది. ఈ మూడు కీలకమైన పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.;

Update: 2025-01-07 14:34 GMT

హైదరాబాద్ (Hyderabad)నగరంలో ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రో(Metro Train) మార్గాల‌కు సంబంధించిన స‌మ‌గ్ర వివ‌ర‌ణాత్మ‌క ప్ర‌ణాళికలు (DPR) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్, హెచ్ఎండీఏ, మెట్రోరైలు విభాగాల అధికారుల‌ను ఆదేశించారు.

- శామీర్ పేట్‌-మేడ్చ‌ల్ మెట్రోల ప్రారంభంలో భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాలని, హెచ్‌జీసీఎల్ కింద రేడియ‌ల్ రోడ్ల (Radial Roads)నిర్మాణం చేపట్టాలని కోరారు. మూడు మెట్రోల డీపీఆర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు.
- హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మీక్షించారు.



 భూసేకరణ చేపట్టాలి

రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం-ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో 40 కిలోమీటర్లు, జేబీఎస్‌-శామీర్‌పేట మెట్రో 22 కిలోమీటర్లు,ప్యార‌డైజ్-మేడ్చ‌ల్ మెట్రో 23 కిలోమీటర్ల మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సీఎం (A REVANTH REDDY) సూచించారు.ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. మేడ్చ‌ల్ మార్గంలో ఎన్‌హెచ్ మార్గంలో ఇప్ప‌టికే ఉన్న మూడు ఫ్లైఓవర్ల‌ను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాల‌ని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

మెట్రో వద్ద భారీ జంక్షన్
శామీర్‌పేట్‌, మేడ్చ‌ల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాల‌ని,అక్క‌డ అధునాతన వ‌స‌తులు, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్ర‌తి ప‌నికి న‌గ‌రంలోకి రాన‌వ‌స‌రం లేకుండా అక్క‌డే అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్ష‌న్‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. జంక్ష‌న్‌కు సంబంధించిన పూర్తి ప్ర‌ణాళిక‌ను త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశించారు.హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్‌) కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.


Tags:    

Similar News