తెలంగాణలో హైడ్రాపై హైకోర్టు పలుసార్లు ఆగ్రహం
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 20 సార్లు అక్షింతలు వేసింది.హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హైడ్రా తీరు మారటం లేదు.;
By : Shaik Saleem
Update: 2025-03-20 05:16 GMT
తెలంగాణ హైకోర్టు హైడ్రాపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. తాము 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశామని, అయినా పిటిషన్లు దాఖలవుతున్నాయని హైకోర్టు పేర్కొంది.తెల్లవారుజామున ఓ ప్రహరీ కూల్చివేశారని, ఇలా దోపిడీ దొంగలు మాత్రమే చేస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ సమాచారం లేకుండా సెలవు రోజున కూల్చివేయడం ఏమిటి? అని హైకోర్టు ఫుల్‌బెంచ్ ఆర్డర్ ఇచ్చినా ఖాతరు చేయరా? అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే తీరును కొనసాగిస్తే హైడ్రా ఏర్పాటు జీవో 99ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
పేదల ఇళ్లు కూల్చివేతలపై ప్రశ్నించిన హైకోర్టు
తెలంగాణ హైకోర్టు హైడ్రా కూల్చివేత విధానాలను బుధవారం ప్రశ్నించింది.మురికివాడల్లోని ఇళ్లను కూల్చివేసి మీడియాలో ప్రచారం చేయడం వల్ల ప్రజా శ్రేయస్సు జరగదని జస్టిస్ రెడ్డి చెప్పారు.పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంపన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను విస్మరిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
పెద్దల ఆక్రమణలను పట్టించుకోరా?
హైడ్రా ఉన్నత వర్గాల ఆక్రమణలను ఎందుకు కూల్చడం లేదని జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా, అదే సమయంలో బడాబాబులు నివాసముంటున్న దుర్గం చెరువు, మియాపూర్ సరస్సుల చుట్టూ ఉన్న ఆక్రమణలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.మురికివాడల్లోని ఇళ్లను కూల్చివేసి మీడియాలో ప్రచారం చేయడం వల్ల ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడదని జస్టిస్ రెడ్డి చెప్పారు. సంపన్న వ్యక్తుల యాజమాన్యంలోని అక్రమ ఆస్తులపై కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.మీరాలం ట్యాంక్‌ను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి రాజేంద్ర నగర్ తహశీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నోటీసులిచ్చాక సమయమివ్వరా?
ఫిబ్రవరి 18 : నోటీసులిచ్చాక కనీసం 24 గంటల సమయం కూడా ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.పటాన్ చెరు మండలం ముత్తంగిలో షెడ్ కూల్చివేతపై జస్టిస్ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చిన రోజే భవనాలను కూల్చివేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది.
హైడ్రాను మూసివేస్తాం...
చట్టవిరుద్ధంగా వెళితే హైడ్రాను మూసివేస్తామని హైకోర్టు హెచ్చరించింది. కొందరు వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదులు చేస్తే వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని హైకోర్టు చెప్పింది.
ఫిబ్రవరి 10 : సెలవు రోజుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం నోటీసులిచ్చి, ఆదివారం సెలవు రోజుల్లో భవనాలను కూల్చివేస్తున్నారని, హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆదేశాలు ఇచ్చినా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం
సెప్టెంబరు 26 : ఓ అక్రమ కట్టడం విషయంలో తాము ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను కూడా పట్టించుకోరా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను నిలదీసింది.అమీన్ పూర్ లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా పనిచేస్తే ఇంటికి వెళతారని కూడా తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
జైలుకు పంపిస్తాం
సెప్టెంబరు 30 : ఇష్టానుసారంగా భవనాలను కూల్చేస్తే జీవో99పై స్టే ఇస్తామంటూ న్యాయస్థానం హెచ్చరించింది. రాజీకీయ నేతల కోసం పనిచేస్తే చంచల్ గూడ, చర్లపల్లికి పంపించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. చార్మినార్, హైకోర్టును కూడా కూల్చివేస్తారా అని హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తహసీల్దార్ చెబితే కూల్చివేస్తారా అని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది.ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని హైకోర్టు హైడ్రాను ప్రశ్నించింది.
సెలవు రోజుల్లో కూల్చివేతలా?
ఫిబ్రవరి 20 :పత్రాలను పరిశీలించి భూయాజమాన్య హకులను నిర్ణయించడానికి మీరెవరు? హకులను తేల్చే అధికారం మీకెకడిది? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటో మీకు తెలుసా? రాత్రికి రాత్రి ఏదో చేసేద్దామని కలలు కంటున్నారా? రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చేస్తారా? సెలవు రోజుల్లో కూల్చివేతలు ఏమిటి? మీకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోరా? ఎన్నిసార్లు చెప్పినా మారరా? ఇలాగైతే హైడ్రాను మూసేస్తాం..’ అంటూ హైకోర్టు హైడ్రాను తీవ్రస్థాయిలో మందలించింది.
హైకోర్టు సుమోటోగా హైడ్రాపై చర్యలు తీసుకోవాలి : డాక్టర్ లుబ్నా సార్వత్
హైకోర్టు హైడ్రాపై పలుసార్లు హెచ్చరికలు చేయడం కాకుండా నేరుగా దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పర్యావరణ యాక్టివిస్టు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైడ్రా చెరువులు, నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. మూడు వేల చెరువులు నగరంలో ఉండగా, హెచ్ఎండీఏ, చెరువుల పరిరక్షణ కమిటీలు వాటి జాబితానే మాయం చేశారని ఆమె ఆరోపించారు.అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయమా అని డాక్టర్ లుబ్నా ప్రశ్నించారు. నార్సింగ్ సరస్సును ఆక్రమించి హైరైజ్ భవనం నిర్మిస్తున్నా హైడ్రాకు కనిపించదా అని ఆమె ప్రశ్నించారు.
హైడ్రా కూల్చివేతలు సరైనవే : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
హైకోర్టు పలు అంశాలపై పలుసార్లు ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెరువుల్లోని ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు సరైనవేనని ఆయన అభిప్రాయపడ్డారు. పేదల ఇళ్లను కూల్చాల్సి వస్తే వారికి ప్రత్నామ్నాయంగా ఇళ్లు ఇవ్వాలని ఆయన కోరారు. తాను హైడ్రా చర్యలను సమర్థిస్తున్నానని సోమ శ్రీనివాసరెడ్డి చెప్పారు.