DSC వాయిదా పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలివే...

ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష నిలిపివేయాలని పదిమంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

By :  Vanaja
Update: 2024-07-18 13:24 GMT

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదలైన డీఎస్సీ ఎగ్జామ్స్ ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు రెండో సెషన్ ఉంటుంది. అయితే ఓవైపు డీఎస్సీ పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు ఈ పరీక్షలు వాయిదా వేయాలనే పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష నిలిపివేయాలని పదిమంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరీక్షలను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానంలో పిటిషనర్లకు నిరాశ ఎదురైంది. పరీక్షలను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.

కాగా, పరీక్షలకు ప్రిపేర్ అవడానికి తగినంత సమయం లేకుండా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఇప్పటికే నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పోస్టులు సంఖ్యను కూడా పెంచాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. నిరసనగా దాదాపు 31 వేలమంది అభ్యర్థులు తమ హాల్ టికెట్ సైతం డౌన్ లోడ్ చేసుకోలేదు. అయితే, ప్రిపేర్ అవడానికి సమయాభావం ఉన్నందువలన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. విచారణ సందర్భంగా పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. సిలబస్ ఎంతో కఠినంగా ఉందని, అభ్యర్థులు చదువుకోడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని, ఇది విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు వచ్చే నెల 5 వరకు కొనసాగుతాయని, ఈ పరీక్షలు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షలు నిలిపివేయడానికి నిరాకరిస్తూ... తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. 

Tags:    

Similar News