ఖమ్మం ఎంపీ అభ్యర్థి ప్రచారానికి హీరో వెంకటేష్

మరో పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.

By :  Vanaja
Update: 2024-04-30 10:59 GMT

తెలంగాణలో మే 13 న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. మరో పది రోజుల్లో తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. బడా నేతల్ని, సినీ ప్రముఖుల్ని ప్రచారంలో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ప్రచారం చేయనున్నారు. మే 7 న ఖమ్మంలో ఆయన ప్రచారం చేస్తారని తెలుస్తోంది.

రఘురాంరెడ్డి ప్రచారానికి వెంకటేష్ ఎందుకు వస్తున్నారు?

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రఘురాంరెడ్డి నటుడు దగ్గుబాటి వెంకటేష్ కి స్వయానా వియ్యంకుడు. ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి, వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితని వివాహం చేసుకోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వియ్యంకుడి ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ పాల్గొనబోతున్నారు. ఇక రఘురాంరెడ్డి చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు స్వప్ని రెడ్డిని వివాహమాడిన విషయం తెలిసిందే.

తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి రఘురాంరెడ్డి...

రామసహాయం సురేందర్ రెడ్డి.. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో ఉన్న మరిపెడ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితుడు. వరంగల్ ఎంపీగా నాలుగు సార్లు, డోర్నకల్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. అందులోనూ ఒకసారి చిల్లంచెర్ల నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1996లో వరంగల్ ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.

మరోవైపు 1976-77లో హైదరాబాద్ రేస్ క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత 1983లో రెండోసారి ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, గోల్ఫ్ క్లబ్‌లకు కూడా ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఇంత రాజకీయ, పాలన అనుభవం ఉన్న రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబంలో రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు రామసహాయం రఘురామ్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున ఖమ్మం పార్లమెంట్ బరిలో నిల్చున్నారు. రఘురాంరెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్‌గా ఉన్నారు. 

Tags:    

Similar News