Harish Rao |‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన రావాలి’
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణలో పాలన గాడి తప్పుతోందని, అధికారంలో ఉన్న నేతలు హింసా రాజకీయాలకు పెంచి పోషిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తేనే శాంతి భద్రతలు పునరుద్దరించబడతాయిన, రాష్ట్రంలో అధికారం పారిన ఏడాదిలోనే క్రైమ్ రేట్ తీవ్రంగా పెరిగిందని అన్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. దీనంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటూ హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రైతులు నట్టేట మునిగారని, రైతులకు అన్యాయం చేశామన్న సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటున్నారంటూ సీఎం రేవంత్‌ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు హరీష్. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని, కానీ చర్చ వచ్చే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా అని ఛాలెంజ్ చేశారు.
‘‘రేవంత్ రెడ్డి.. రైతులను ముంచుండు, మోసం చేసిండు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాంహుల్ గాంధీ చెప్పిన హామీ ని కూడా నిలబెట్టు కోలేదు..నేను చర్చకు సిద్దం. ఎకరాకు రూ.9 వేలు ఎగబెట్టింది..ఇదే కాంగ్రెస్ గొప్పతం. వనాకం గుండు సున్నా పెట్టినావు. ఎకరానికి రూ.15 వేలు ఇచ్చే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీయండి. రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు బంధు ఇస్తామని చెప్పి.. కౌలు రైతుల ఎందుకు ఇవ్వడం లేదు. ఇదేనా రైతు రాజ్యం? కౌలు రైతు, రైతు బంధు ఎగబెట్టినందుకు రేవంత్‌కు పాలాభిషేకం చేయాలా. కాంగ్రెస్ నాయకులను ఎక్కడి కక్కడ నిలాదీయాలి. ఎన్నికల అప్పుడు మాటలు కోటలు దాటినవి..ఇప్పుడు కోతలు పెడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘1 ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ.12 వేలు ఇవ్వాలి. 5 గుంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్ట పోతున్నారు. మెడమీద తలకాయ ఉన్నవాడు ఎవడూ ఇలాంటి పథకం పెట్టడు. అసలు ఇదేమి పథకం. మట్టి పనికి పోయే కోటి మంది కి వ్యవసాయ కూలి పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టు పెడితివి. రూ.లక్ష రుణ మాఫీ ఉన్న రైతులకు కూడా మొండి చేయి చూపావు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ చేసిన ఈ మోసానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘రేవంత్ రెడ్డిని అడుగుతే రేపు గుండాలను నా ఇంటి మీదకు పంపుతారు. పంటల బీమా పథకం అటకెక్కింది. ఈ విషయంపై అసెంబ్లీలో మాట్లాడుతా. రూ.15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగులో ఉంది. ఏ మొఖం పెట్టుకొని పాలాభిషేకం చేయుమంటారు. అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ రెడ్డి కావాలనే సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద, ప్రశ్నిస్తున్న ప్రజల మీద పట్టపగలు దాడులు జరుగుతున్నా పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారు. భువనగిరిలో బీఆర్‌ఎస్ కార్యాలయంలో దాడి జరిగినప్పుడు పోలీసులు దగ్గరుండి దాడులు చేయించారు’’ అని ఆరోపించారు.
‘‘సీఎం హోమ్ మినిస్టర్‌గా ఉండి దాడులు చేయిస్తే పెట్టుబడులు ఎలా పెడతారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎస్కార్ట్‌లో వచ్చి దాడులు చేశారు. రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం అంటే దాడులను ప్రోత్సహించడే కదా. ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది.. దాడులను బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. కాంగ్రెస్ గూండాలు కర్రలు, రాళ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేసిందా? బీఆర్ఎస్ పార్టీ పెట్టుబడి రావాలని ఆలోచించింది. దాడుల గురించి కాదు. 6 గ్యారంటీ అమలు చేయడం లేదని ప్రజకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్రంలో 23 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. రేవంత్ రెడ్డి హింస రాజకీయాలను వెంటనే ఆపాలి. దాడులను ఆపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలాని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై కేంద్ర హోంశాఖ రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.