రేవంత్ రెడ్డి మహానటుడు.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సెటైర్లు వేశారు. మెగాస్టార్, సూపర్ స్టార్లను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ పంచులు పేల్చారు.

Update: 2024-10-18 07:53 GMT

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సెటైర్లు వేశారు. మెగాస్టార్, సూపర్ స్టార్లను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ పంచులు పేల్చారు. మూసీ నది అంశంపై సీఎం రేవంత్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారే తప్ప, అవగాహనతో కాదని, ఆయన అవగాహన నిల్ అని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఒక్క విషయంలో కూడా సక్సెస్ కాలేకపోయారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారంటూ విమర్శించారు.

అంతేకాకుండా మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అందుకే ప్రక్షాళనకన్నా ముందు ఇళ్ల కూల్చివేతలు మొదలయ్యాయంటూ ఆరోపించారు. కానీ కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు ఒక్క పేదోడు కూడా బలికాడని, పేదోళ్లకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఏదో కాసేపు మాట్లాడేసి వెళ్లామన్నట్లు రేవంత్ ప్రవర్తిస్తున్నారే తప్ప.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏంటో కూడా ఆయనకు సరిగా తెలీదంటూ ఎద్దేవా చేశారు.

నది పునరుజ్జీవనం అక్కడే మొదలవ్వాలి

‘‘సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేమితో మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవనం అని చెప్తూ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నదీ పునరుజ్జీవనం అంటే ముందుగా ఆ నదుల్లోని నీటిని శుభ్రం చేయాలి. కేసీఆర్ హయాంలో మూసీ ప్రక్షాళనను అలాగే ప్రారంభించాం. వ్యర్థాలు మూసీలో కలవకుండా చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 ఎస్‌టీపీలను సిద్ధం చేశాం. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకురావడం కోసం డీపీఆర్ కూడా సిద్ధమైంది’’ అని గుర్తు చేశారు.

మూసీ ప్రక్షాళకు మేం వ్యతిరేకం కాదు..

‘‘సీఎం రేవంత్ మాటలు వింటే అబద్దం కూడా ఆశ్చర్యపోతుంది. మేము మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఈ ప్రాజెక్ట్ పేరిట ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లను కూల్చి వారిని రోడ్డున పడేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాం. వారికి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత కూలుస్తామంటూ మేము ఎందుకు అడ్డుపడతాం. పేదలను నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ విషయంలో మేము మా గళం వినిపిస్తున్నాం. శత్రుదేశాలపై చేసిన రీతిలో పేదల ఇళ్లే టార్గెట్‌గా వీకెండ్స్ సమయంలో బుల్డోజర్లు తీసుకెళ్లి దాడులకు పాల్పడుతోంది ఈ ప్రభుత్వం. సీఎం అన్న పదవి స్థాయిని తగ్గించిన ఘనత రేవంత్‌కే దక్కుతుంది. రేవంత్ ముందు సూపర్ స్టార్, మెగా స్టార్‌లు కూడా దిగదుడుపే. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

నేను కార్ డ్రైవ్ చేస్తా..

‘‘మూసీ ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. టైమ్, డేట్ మీరే ఫిక్స్ చేయండి. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటా. సెక్యూరిటీ లేకుండా వస్తా అని సీఎం అన్నారు కదా.. రండి ఎక్కడకైనా రావడానికి నేను సిద్ధం. బాధితులతో మాట్లాడటానికి మీరు సిద్ధమా? అంత దమ్ము సీఎంకు ఉందా? రివర్స్ ఫ్రంట్ ఏంటి? దాని వెనకున్న స్టంట్ ఏంటి? కార్ డ్రైవ్ చేసుకుంటూ పోదాం.. ముందు మూసీ దగ్గరకు వెళ్దాం. ఆ తర్వాత అక్కడి నుంచి కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, కిష్టాపూర్ వద్దకు కూడా వెళ్దాం’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News