అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది: హరీష్
కౌశిక్ రెడ్డిపై ఉన్న 28 కేసులు ఎవరు పెట్టారని హరీష్ ప్రశ్నించారు.;
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. కాగా కౌశిక్ అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు కౌశిక్ రెడ్డిని అర్థరాత్రి వేళ హడావుడిగా తమ నేతను ఎందుకు అరెస్ట్ చేశారని హరీష్ రావు నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్త చేశారు. కాగా రాత్రి సమయంలో కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బీఆర్ఎస్ నేతల పోరాటాన్ని అడ్డుకోలేరని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. మంగళవారం కోకాపేటలోని తన నివాసంలో హరీష్ రావు మాట్లాడారు. పాలకులు చెప్తే వెనకాముందు ఆలోచించకుండా తొందరపడి అరెస్ట్ చేయడం మంచిది కాదని పోలీసులకు చెప్పారు హరీష్. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్ట్ చేయొద్దని డీజీపీ, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసలు తమ నేత కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి వేళ బెయిలబుల్ సెక్షన్లతో ఎందుకు అరెస్ట్ చేయాల్సివచ్చిందని నిలదీశారు.
‘‘నాయకులు చెప్పగానే గుడ్డిగా వారి మాట నమ్మేసి బెయిలబుల్ కేసుల్లో అరెస్ట్ చేయడం సరికాదు. అసలు బెయిలబుల్ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా చెప్పాయి. పండగ పూట డెకాయిట్, టెర్రరిస్ట్‌లా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం తప్పు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లి దోమలు కుడుతున్నా రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు’’ అని హరీష్ రావు అన్నారు.
కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టిందెవరు
కౌశిక్ రెడ్డిపైన 28 కేసులు ఉన్నాయని, అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నారని హరీష్ రావు గుర్తు చేశారు. అసలు ఆ కేసులు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు అసలు కౌశిక్ పైన ఒక్క కేసైనా ఉందా? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే కౌశిక్‌పై 28 కేసులు నమోదు చేశారు. వాటన్నింటి వెనక ఉంది కాంగ్రెస్ సర్కార్ కాదా? అని నిలదీశారు. కలెక్టర్ ఆహ్వానం అందిస్తేనే కరీంగనర్ జెడ్‌పీ మీటింగ్‌కు కౌశిక్ రెడ్డి వెళ్లారే తప్ప పిలవని పేరంటానికి ఆయన వెళ్లలేదని అన్నారు హరీష్. సంజయ్‌ను నువ్వే పార్టీ తరపున మాట్లాడుతున్నావని కౌశిక్ నిలదీశారని, అందులో తప్పేముందని హరీష్ అడిగారు. అది తమ పార్టీ వారే కాదని రాష్ట్ర ప్రజలంతా అడుగుతున్న ప్రశ్నే అని అన్నారు. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కీలకంగా మారాయి.