రేవంత్ కు హరీష్ సన్మానం

రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఎంతటి బద్ధశతృవులో అందరికీ తెలిసిందే. అలాంటి హరీష్ రావు రేవంత్ కు సన్మానం చేయటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు.

Update: 2024-05-03 11:56 GMT

రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఎంతటి బద్ధశతృవులో అందరికీ తెలిసిందే. అలాంటి హరీష్ రావు సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతు రేవంత్ కు సన్మానం చేయటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇక్కడ చిన్న మెలిక కూడా పెట్టారు. అదేమిటంటే ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ అమలుచేస్తే ఇదే సిద్ధిపేటలో రేవంత్ కు తాను ఘన సన్మానం చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలుచేస్తానని చెప్పిన కాంగ్రెస్ పత్తాలేకుండా పారిపోయిందని విమర్శించారు. రుణమాఫీకి ఇపుడు కొత్తగా ఆగస్టు 15వ తేదీని డెడ్ లైన్ గా రేవంత్ ప్రకటించటాన్ని హరీష్ ఎద్దేవాచేశారు.

పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయటం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్ధిపేటనే అని గర్వంగా చెప్పుకుంటానని హరీష్ అన్నారు. తెలంగాణా రావటానికి కేసీయారే కారణమని మరోసారి హరీష్ చెప్పారు. ఇందులో ఎవరికీ అనుమానం అవసరంలేదన్నారు. ముఖ్యమంత్రయ్యే అవకాశం వచ్చినందకు తెలంగాణాతో పాటు కేసీయార్ కు రేవంత్ రుణపడి ఉండాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే ఒకరకంగా హరీష్ చెప్పింది కూడా కరెక్టనే అనుకోవాలి. ఎలాగంటే పదేళ్ళ కేసీయార్ పాలనతో జనాలు బాగా మండిపోయిన కారణంగానే కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్ సీఎం అయ్యారు.

రాజీనామాకు సిద్ధంగా ఉండాలన్న రేవంత్ హెచ్చరికకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రేవంత్ ఆగస్టు 15వ తేదీకి రుణమాఫీ చేస్తే తాను సిద్ధిపేట ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని హరీష్ మరోసారి ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్న రేవంత్ మాటలను హరీష్ ఖండించారు. అభివృద్ధి విషయంలో రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని మండిపోయారు. కేసీయార్ హయాంలో తెలంగాణాలో జరిగిన అభివృద్ధి ఏమిటో జనాలందరికీ తెలుసని హరీష్ చెప్పారు. మొత్తంమీద ఆగష్టు 15వ తేదీన రేవంత్ కు హరీష్ సన్మానం చేస్తారా ? లేకపోతే ఎంఎల్ఏగా హరీష్ రాజీనామా చేస్తారా అన్నది తేలిపోతుంది.

Tags:    

Similar News