HAPPY NEW YEAR 2025 | హైదరాబాద్ వాసులకు శుభవార్త
కొత్త సంవత్సరం 2025లో హైదరాబాద్ వాసులకు పలు ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు శుభవార్త వెల్లడించాయి.
By : Shaik Saleem
Update: 2024-12-30 13:45 GMT
కొత్త సంవత్సర వేళ డిసెంబరు 31వతేదీన హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను రాత్రి 12.30 గంటల వరకు పొడిగించారు. వేడుకల్లో పాల్గొనే వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్లకు చేరుకునేలా మెట్రో రైలు సమయాలను పెంచారు.
- కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ నగరంలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఫోరో వీలర్స్ అసోసియేషన్ తెలిపింది.
- తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. వారంలో రెండు రోజుల పాటు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై తిరుమల దర్శనం ఇవ్వాలని టీటీడీ తీసుకున్న నిర్ణయానికి ఏపీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారానికి రెండు సార్లు బ్రేక్ దర్శనం, రెండు సార్లు రూ.300 దర్శనాలు చేసుకునేందుకు టీటీడీ వీలు కల్పించింది.
- తెలంగాణలోని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- 2025వ సంవత్సరంలో రైతులకు రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది.
- జనవరి 3వతేదీ నుంచి ఫిబ్రవరి 15వతేదీ వరకు నాంపల్లిలో నుమాయిస్ నిర్వహించనున్నారు.
- జియో ఫోన్ 2025వ సంవత్సరంలో 2,025 రూపాయలతో 200 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
- హైదరాబాద్ నగరంలో 2025వ సంవత్సరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి.