ప్రవాసీ ప్రజావాణిలో వెలుగుచూసిన గల్ఫ్ కార్మికుల గోడు
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు పలు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల గోడు వెలుగులోకి వచ్చింది.
By : Shaik Saleem
Update: 2024-09-27 07:25 GMT
ఉపాధి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు ఏజెంట్ల చేతుల్లో మోసాల పాలై పలు అవస్థలు పడుతున్నారు. కొందరు గల్ఫ్ దేశాల్లోనే అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో ఉన్నారు. మరికొందరు తెలిసీ తెలియక కేసుల్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గుతున్నారు. ఇలా ఎన్నెన్నో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల గోడు శుక్రవారం హైదరాబాద్ నగరంలోని జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో వెలుగుచూశాయి.
ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణిని హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,సీసీసీ ఎన్నారై సెల్ ఛైర్మన్ వినోద్ , ప్రజావాణి నోడల్ ఆఫీసర్లు ,ఇతర ఎన్నారై విభాగం నేతలు, పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి పాల్గొన్నారు.
వినతులను స్వీకరించిన మంత్రి
ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ బాధితుల నుంచి వినతిపత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. తమ గోడును వినతిపత్రాల రూపంలో బాధితులు మంత్రికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నాలుగు అంశాలపై సర్కారు నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు 4 అంశాల పై తాము నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రజా భవన్ లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఉపాధి నిమిత్తం వెళ్లారని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవడానికి ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
గల్ఫ్ దేశాల్లో జరిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.గల్ఫ్ కార్మికుల కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో సీట్లు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించారు.
ఏజెంట్ల మోసాలను నిరోధిస్తాం
కొందరు ఏజెంట్లు ప్రజలను మోసం చేస్తూ విదేశాలకు పంపించి అక్కడ వారు ఇబ్బందులు పడేలా చేస్తున్నారని, అందుకే ఏజెంట్ల మోసాలను నిరోధిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మోసాలు చేసే ఏజెంట్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం పోయేవరికి అక్కడి చట్టాలపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ‘ప్రవాసీ ప్రజావాణి’
ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు ‘ప్రవాసీ ప్రజావాణి’ని ప్రారంభించామని పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మందా భీమ్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ వలస కార్మికులకు ఈ ప్రత్యేక కౌంటర్ సేవలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు జీతం బకాయిలు, స్పాన్సర్‌షిప్ సమస్యలు, కాంట్రాక్ట్ వివాదాలు, కార్మికుల దుర్వినియోగం, విదేశాల్లో జైలు శిక్ష, మృత దేహాలను రవాణా చేయడంలో జాప్యం, స్వదేశానికి తరలించడం, ఆచూకీ కనుగొనడం, వైవాహిక వివాదాలతో సహా పలు సమస్యలను గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్ (PFO) సహాయంతో రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా మోసం జరిగిన సందర్భాల్లో కూడా ఈ కౌంటర్ మద్దతునిస్తుందని చెప్పారు.