గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత.. రోడ్డెక్కిన గ్రూప్-4 అభ్యర్థులు
గ్రూప్-1 మెయిన్స్ సమస్య తీరకముందే గ్రూప్-4 అభ్యర్థులు కూడా రోడ్డెక్కారు. గాంధీ భవన్ దగ్గర తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ సమస్య తీరకముందే గ్రూప్-4 అభ్యర్థులు కూడా రోడ్డెక్కారు. గాంధీ భవన్ దగ్గర తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 మెయిన్స్‌కు ఎంపికైన వారిని గ్రూప్-4 నుంచి తక్షణం అన్‌లివింగ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద పోస్ట్‌లలో ఉన్నవారికి అన్‌లివింగ్ ఇవ్వాలని, వారికి పోస్ట్‌లు వచ్చి వెళ్లిన తర్వాత బ్యాక్‌లాగ్స్ ఉంచొద్దని గ్రూప్-4 అభ్యర్థులు కోరుతున్నారు. అన్‌లివింగ్ చేయకపోవడం వల్ల గ్రూప్-4 అభ్యర్థులు నష్టపోతారని, దాదాపు 2వేల పోస్ట్‌లు ఖాళీ అయ్యే అవకాశం ఉందని, వెంటనే ప్రస్తుతం స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రూప్-4 అభ్యర్థులు ప్రాథేయపడుతున్నారు. గ్రూప్-4 అభ్యర్థుల ఆందోళనతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల పరిస్థితి అయోమయంలో ఉంది. వారి డిమాండ్ నెరవేరుతుందా లేదా అనేది కూడా అర్థంకాని స్థితికి చేరుకుంది.
సుప్రీంకోర్టు వాయిదా..
గ్రూప్-1 మెయిన్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వివరించింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అయితే గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సోమవారమే జరగనుంది. దీంతో అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని పిటిషనర్ కోరినప్పటికీ అందుకు సుప్రీంకోర్ట న్యాయమూర్తులు అంగీకరించలేదు. దీంతో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా అంశం అయోమయంలో పడింది.
జరిగేదదేనా..
గ్రూప్-1 పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టే సమయానికి తెలంగాణలో పరీక్ష నిర్వహించడం, అందుకు లక్షల మంది అభ్యర్థులు హాజరుకావడం జరుగుతుందని, దీంతో పరీక్షను వాయిదా వేయడం కుదరని సుప్రీంకోర్టు చెప్పే అవకాశాలు అధికంగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కాగా అభ్యర్థుల డిమాండ్ న్యాయంగా ఉంటే పరీక్ష ముగిసిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని మరికొందరు పేర్కొంటున్నారు. మరి గ్రూప్-1 మెయిన్స్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
అందుబాటులో హాల్‌టికెట్లు
ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి హాల్‌టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులంతా మెయిన్స్ రాయనున్నారు. ఈ మెయిన్స్ పరీక్షలను హెచ్ఎండీఏ పరిధిలో నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే ఒక్కరోజు ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ మెయిన్స్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. అభ్యర్థులంతా కూడా పరీక్ష మొదలుకావడానికి 30నిమిషాల ముందే సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు అభ్యర్థులను సెంటర్ల లోపలకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని అధికారులు వెల్లడిస్తున్నారు.