ధాన్యం కొనుగోలుకు సర్కార్ సై.. మా పరిస్థితి ఏంటంటున్న మిల్లర్లు..

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంది.

Update: 2024-10-10 06:26 GMT

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. రైతులకు నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో వరి ధాన్యం సేకరణకు సమగ్ర, పాదర్శక ప్రణాళికలను తీసుకురానున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేయనుందని ధాన్యం సేకరణ విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చించి ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులతో పాటు మిల్లర్లు కూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిల్లర్లకు ఇచ్చిన ధాన్యానికి బ్యాంక్ గ్యారెంటీ విషయంలో ఉత్తమ విధానాన్ని కూడా అమలు చేస్తామని, తెలంగాణ రైతుల నిశ్చింతగా ఉండొచ్చని వివరించారు. సన్న, దొడ్డు ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, అందుకోసం ఎక్కడిక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. దాంతో పాటుగా సన్న, దొడ్డు ధాన్యం కొనుగోలుకు వేరువేరు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

నాణ్యతకు పెద్దపీట..

రైతులు అమ్మే ధాన్యం రకాలు, నాణ్యత నిర్ధారణ కసం డిజిటల్ గ్రెయిన్ కాలిపర్‌లు, పొట్టు తొలగించే యంద్రాలను కూడా అందిస్తామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ‘‘దాంతో పాటుగా సన్నాలు, దొడ్డు ధాన్యాన్ని త్వరగా గుర్తించడం కోసం సన్నరకం ధాన్యపు మూటలను ఎరుపు రంగు దారంతో, దొడ్డు ధాన్యం సంచులను ఆకుపచ్చ దారంతో కట్టాలి’’ అని సూచించారు మంత్రి. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రం, రైస్ మిల్లింగ్ పరిశ్రమల మధ్య పరస్పర సహకారం ఉండాలని, దానిని తాము గుర్తించామని చెప్పారు. అతి త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుందని, మిల్లర్ల డిమాండ్ల విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు ధాన్యాన్ని ఇంటర్మీడియట్ గోదాముల్లో నిల్వచేయాలని ఆయన సూచించారు.

ఆ నష్టం ఎవరికి: మిల్లర్లు

ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు మిల్లర్లు పలు డిమాండ్లను ఉంచారు. దొడ్డు బియ్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 శాతం వస్తాయని, అదే సన్నాలు అయితే బియ్యం తక్కువ, నూకలు ఎక్కువగా వస్తాయని, ఆ నష్టాన్ని ఎవరు భరించాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. గత పదేళ్లలో అప్పటి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం వింటోందని, కాకపోతే పరిష్కారం చూపితే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ధాన్యం మిల్లింగ్ సహా ఇతర ఛార్జీలను పెంచాలని మిల్లర్లు కోరుతున్నారు. వారి డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం.. మిల్లర్లు అక్రమాలకు పాల్పడొద్దని, వారికి తాము న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కారిస్తామని, అప్పటి వరకు వేచి చూడకుండా ఎవరైనా తప్పుదారి వైపు చూస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టినట్లు తెలిసినా ఊరుకోమని, రైస్ మిల్లర్లకు ఉన్న సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం.

Tags:    

Similar News