తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి భూమి పూజ

డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

By :  Vanaja
Update: 2024-08-28 07:53 GMT

డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేశారు. సచివాలయంలో మెయిన్ గేట్ నుంచి భవనం లోపలికి వెళ్లే మార్గంలో పోర్టుకోకి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ కనిపించేలా ఉంటుందని సీఎం, డిప్యూటీ సీఎం, అధికారుల పలు చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానంలోనే నేడు ప్రభుత్వం భూమిపూజ నిర్వహించింది.

ఎలాగైనా డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం చేస్తున్నట్లు ప్రకటించారని, అందుకే ఆ తేదీన విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ చెబుతోంది. జవహర్ జవహర్ లాల్ నెహ్రూ ఫైనాన్స్ యూనివర్సిటీ ఆర్టిస్టులు, తెలంగాణకు చెందిన కళాకారులు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ విగ్రహాన్ని ఖరారు చేయనున్నారు.

ఇక కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దసరా వరకు మంచి రోజులు లేవని వేద పండితులు చెప్పడంతోనే హడావిడిగా భూమి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పేలా, తెలంగాణ ప్రజల దయాగుణం, త్యాగనిరత, మహిళల రూపం అన్నీ కలిసేలా విగ్రహం రూపొందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే ఉంటుందని అన్నారు. సంకల్పం పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఉండదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని రేవంత్ అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల చిరకాల ఆశయాన్ని సోనియా గాంధీ నెరవేర్చారని చెప్పుకొచ్చారు. పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని తెరమరుగు చేసిందని మండిపడ్డారు. నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అన్నట్టు గత పాలకులు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు వ్యతిరేకమని వెల్లడించారు. సచివాలయం తెలంగాణకు తెలంగాణ ప్రజలకు గుండెకాయ లాంటిదని, అందుకే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

గత పాలకులు పదేళ్లలో సచివాలయంలోకి ప్రజలకు ప్రవేశం కల్పించలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు వారికి మనసు రాలేదని దుయ్యబట్టారు. ట్యాంక్ బండ్ నలువైపులా ఎంతో మంది ప్రముఖుల విగ్రహాలున్నాయి, కానీ దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా కనిపించిందని రేవంత్ అన్నారు. అందుకే మేధావుల సూచన మేరకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీన్ని వివాదం చేసేందుకే బీఆర్ఎస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహంతో ముడిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News