తెలంగాణలో మైనారిటీలపై సర్కారు చిన్నచూపు

తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కుంటుపడింది.సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఎస్ఐఓ, అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనామిక్ ఎంపవర్ మెంట్ సంస్థల నివేదికల్లో వెల్లడైంది.;

Update: 2025-03-14 01:32 GMT

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కుంటుపడింది.మైనారిటీల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినా నిధులు మాత్రం అరకొరే విడుదల చేసింది. కాంగ్రెసే కాదు గత బీఆర్ఎస్ సర్కారు కూడా మైనారిటీలకు నిధులు ఇవ్వకుండా అరకొర నిధులే కేటాయించింది. గత అయిదేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు ఘనంగా ఉన్నా నిధుల విడుదల అంతంత మాత్రంగానే ఉంది.మైనారిటీల సంక్షేమ పథకాలు సజావుగా అమలు కావడం లేదని ఎస్ఐఓ, అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనామిక్ ఎంపవర్ మెంట్ సంస్థలు రూపొందించిన నివేదికల్లో వెల్లడైంది.బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మందకొడిగా సాగుతున్న మైనారిటీల సంక్షేమంపై ‘ఫెడరల్ తెలంగాణ ’ సమగ్ర కథనం....


కేటాయింపులు ఘనం...నిధుల విడుదల నామమాత్రం
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నా, నామమాత్రంగా నిధులను విడుదల చేస్తున్నారు. విడుదల చేసిన అరకొర నిధులు కూడా ఖర్చుచేయడం లేదు. దీంతో మైనారిటీ సంక్షేమ పథకాలు సజావుగా అమలు కావడం లేదు. 2024-25వ ఆర్థిక సంవత్సరంలో మైనారిటీల సంక్షేమ పథకాల కోసం రూ.300కోట్లను బడ్జెట్ లో కేటాయించారు. ఇందులో రూ.223 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన నిధుల్లో కేవలం రూ.41.86లక్షలే ఖర్చు చేశారు. అంటే కేవలం 14 శాతం మాత్రమే పథకాలు అమలు చేశారు. మైనారిటీల సంక్షేమానికి 2023-24వ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పథకాలే అమలు చేశారు. 2020-21లో బడ్జెట్ లో రూ.206 కోట్లు కేటాయించినా కేవలం రూ.136 కోట్లే ఖర్చు చేశారు. 2022-23లో రూ.200 కోట్లు కేటాయించినా అమలులో కేవలం 117 కోట్ల రూపాయలే ఖర్చు చేశారు.

మైనారిటీల సంక్షేమానికి నిధులేవి?
తెలంగాణలో నిధుల కొరత వల్ల మైనారిటీల సంక్షేమ పథకాలు సజావుగా సాగటం లేదని అసోసియేషన్ ఫర్ సోషియో-ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ది మార్జినలైజ్డ్ (అసీమ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మైనారిటీలకు పలు వాగ్ధానాలు చేసినా వాటిని అమలు చేయడంలో విఫలమైంది. మైనారిటీలకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నా, నిధుల విడుదల, వాస్తవ వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ నివేదిక వెల్లడించింది. మైనారిటీలకు బ్యాంక్ లింక్ డ్ పథకాలకు రూ.300 కోట్లు కేటాయించినా కేవలం ఉద్యోగుల జీతాలకే రూ.3 కోట్లు కేటాయించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా లక్ష రూపాయల కూడా మైనారిటీ నిరుద్యోగులకు రుణాలు ఇప్పించలేదు.


పెళ్లిళ్లు అయినా అందని షాదీ ముబారక్ పథకం
తెలంగాణలో మైనారిటీ అవివాహిత యువతుల పెళ్లి కోసం 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబరు 2వతేదీన షాదీ ముబారక్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ జీఓ నంబ రు 25 ప్రకారం పెళ్లి కాబోయే యువతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెళ్లి చేసుకున్నా వధువులకు షాదీ ముబారక్ ఆర్థిక సహాయం అందలేదు. వందలాది మంది వధువులు సర్కారు సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనున్నా రూ.1,11,800 షాదీ ముబారక్ నిధులను కాంగ్రెస్ సర్కారు విడుదల చేయలేదు.

మైనారిటీ విద్యార్థులకు అందని స్కాలర్‌షిప్‌లు
తెలంగాణలో మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియెట్ నుంచి పీజీ, పీహెచ్ డీ విద్యార్థులకు ఫోజు రీయంబర్స్ మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు అందించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నా, ఈ పథకం కింద సర్కారు నిధులు విడుదల చేయలేదు. మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో సహాయపడటానికి ఉద్దేశించిన ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం,పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు అమలు కాలేదు.

ఆందోళన చేసినా నిధులేవి?
మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయంబర్స్ మెంట్ల కోసం నిధులు విడుదల చేయాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆందోళన చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు.మైనారిటీల సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి మైనారిటీ సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీని నియమించినా, ప్రయోజనం లేకుండా పోయింది. మైనారిటీల సంక్షేమ పథకాలు సజావుగా అమలు చేయకున్నా సలహాదారు పట్టించుకోవడం లేదని ఎస్ఐఓ విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు రాక పలువురు మైనారిటీ విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఇస్లామిక్ కాలమిస్ట్ ముహ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనికి తోడు కేంద్ర మైనారిటీ మంత్రిత్వ శాఖ అమలు చేసే మెరిట్ కం మీన్స్ స్కాలర్ షిప్ పథకాన్ని నిలిపివేసింది. కేంద్రంలోని మోదీ సర్కారు మైనారిటీ సంక్షేమ పథకాలను రద్దు చేసినా పట్టించుకునే వారు లేరు. దీనికి తోడు కేంద్రంలో మైనారిటీ మంత్రి కూడా లేరు. మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద బడ్జెట్ పెంచినా, అసలు ఈ పథకం కింద నిధులే విడుదల చేయలేదు. దీంతో వందలాది మంది విదేశీ చదువులకు వెళ్లిన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.5 లక్షలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ.10,000 వరకు ఆర్థిక సహాయం అందించాల్సిన అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం అమలు కాలేదు.

మైనారిటీ నిరుద్యోగులకు అందని సంక్షేమ పథకాలు
మైనారిటీ నిరుద్యోగులకు అందని సంక్షేమ పథకాలు అందడం లేదు. రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందించాల్సి ఉండగా, ఈ పథకాన్ని అమలు చేయలేదు. నిరుద్యోగ మైనారిటీ యువతకు ఏటా రూ.1000 కోట్ల నిధులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామి ఇచ్చినా అది అమలు చేయలేదు.సెట్విన్, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలకు నిధఉలు కేటాయించలేదు. దీంతో నైపుణ్య శిక్షణ, ఉపాధి పథకాలు మూలన పడ్డాయి.


Tags:    

Similar News